‘అణు’ భద్రతకు ఢోకా లేదు
Published Wed, Aug 14 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
కూడంకులం, కల్పాకంలోని అణు విద్యుత్ కేంద్రాలు సురక్షిత రీతిలో నిర్మితమయ్యూయని మద్రాసు అణువిద్యుత్ కేంద్రం డెరైక్టర్ టి.జె.కోటీశ్వరన్, ఐజీసీఏఆర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ హెడ్ ఎం.సాయిబాబా స్పష్టం చేశారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా అత్యాధునిక టెక్నాలజీలతో ఈ కేంద్రాల్లో భద్రత ఉందని పేర్కొన్నారు. కల్పాకంలో అతివేగ ఈ అణు విద్యుత్ యూనిట్ పనులు వేగవంతం అయ్యూయని తెలిపారు.
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ఇంజినీరింగ్ అండ్ న్యూక్లియర్ సైన్స్ విభాగం నేతృత్వంలో ఎపిప్ హనీ సదస్సు (టెక్నికల్ ఫెస్ట్) -13 మంగళవారం ప్రారంభమైంది. ఈ ఫెస్ట్ ను కోటీశ్వరన్, సాయిబాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా అణు విద్యుత్ ఆవశ్యకత గురించి వారు వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కూడంకు లం అణు విద్యుత్ కేంద్రం, కల్పాకం కేంద్రం లోని యూనిట్లు, అక్కడి పనితీరు, విద్యుత్ ఉత్పత్తి విధానం తదితర అంశాల్ని వివరించే రీతిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వారు ప్రారంభించారు. కూడంకులంలోని భద్రత, రియాక్టర్ కూలింగ్, యురేనియం నిక్షేపాలు నింపే ప్రక్రియ తదితర అంశాల గురించి ఆ కేంద్రం సైంటిఫిక్ అధికారి సుందరరాజన్ వివరించారు.
అవగాహన లోపమే
మీడియా ప్రశ్నలకు కోటీశ్వరన్, సాయిబాబా సమాధానాలిచ్చారు. కల్పాకం, కూడంకులం అణు విద్యుత్ కేంద్రాలు సురక్షితంగా నిర్మితమయ్యూయని వివరించారు. కొందరు అవగాహన లోపంతోనే ఆ కేంద్రాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కల్పాకం సముద్ర తీరంలో అగ్ని పర్వతం ఉందన్న సమాచారం ప్రచారం మాత్రమేనని కొట్టి పారేశారు. అక్కడ అగ్ని పర్వతం ఉంది అనడానికి ఆధారాలు లేవన్నారు. అయితే ఆ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని తమ వంతు పరిశోధనలు వేగవంతం చేశామని వివరించారు. ఇంత వరకు జరిగిన పరిశోధనల్లో ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. కల్పాకంలో అతి వేగ ఈ అణు విద్యుత్ యూనిట్ పనులు వేగవంతం అయ్యాయని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా 500 మెగావాట్ల విద్యుత్ మరో ఏడాదిలో ఉత్పత్తి కాబోతోందన్నారు. కల్పాకంలో అణు నిక్షేపాల కారణంగా ప్రాణనష్టం జరిగిందన్నది కేవలం ప్రచారమేనని కొట్టి పారేశారు. రాత్రీపగలు తామంతా ఆ కేంద్రంలోనే పనిచేస్తున్నామని, తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తలేదని తెలిపారు.
అత్యాధునిక టెక్నాలజీతో భద్రత
అణు విద్యుత్ కేంద్రాల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన భద్రత ఉందని కోటీశ్వరన్, సాయిబాబా తెలియజేశారు. విపత్తులు ఎదురైనా తట్టుకునే రీతిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. కల్పాకంలోని కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మూడు సెన్సార్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భూ ప్రకంపనలు చోటు చేసుకున్నా, సునామీ వంటి ప్రళయాలు సంభవించినా ఈ సెన్సార్‌లు తక్షణం అణు విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేస్తాయన్నారు. అలాగే అణు రియాక్టర్ల వేడిమిని తగ్గించేం దుకు ప్రత్యేక రిజర్వాయర్‌ను నిర్మించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డెరైక్టర్ ముత్తమిళ్ సెల్వన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement