
చిన్నమ్మకు ‘ఈసీ’ షాక్
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారంలో చిన్నమ్మ శశికళకు కేంద్ర ఎన్నికల యంత్రాంగం షాక్ ఇచ్చింది. ఆమె నియామకం గురించి వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీ ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్‌కు లేదని స్పష్టం చేసింది. పదో తేదీలోపు శశికళ సంతకంతో వివరణ తమకు సమర్పించాలని శుక్రవారం రాత్రి ఆదేశించింది.
దివంగత సీఎం జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడ్డ విషయం తెలిసిందే. జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలో ఓ శిబిరం, మాజీ సీఎం పన్నీరుసెల్వం నేతృత్వంలో మరో శిబిరంగా, జయలలిత మేన కోడలు దీప నేతృత్వంలో మరో శిబిరంగా పార్టీ కేడర్ చీలారు. అయితే, ప్రభుత్వం చిన్నమ్మ శిబిరం చేతిలో ఉన్నా, పార్టీ మాత్రం తమదేనని, శశికళ నియామకం చెల్లదంటూ పన్నీరు శిబిరం వాదిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది.
తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదు అని, ఎలాంటి అధికారాలు లేకుండా ఆమె నియామకాలు, తొలగింపులు సాగించారని ఆ ఫిర్యాదులో పన్నీరు శిబిరం పేర్కొంది. దీనిపై శశికళను కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరగా, ఆమె తరఫున అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గత నెల 28న ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకే నియమ నిబంధనల మేరకు శశికళ నియామకం జరిగినట్టు వివరించారు.
అయితే, ఆ వివరణను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణించలేదు. శశికళ తరఫున వివరణ ఇచ్చే అధికారం టీటీవి దినకరన్‌కు లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడ్డట్టు తమిళనాట మీడియాల్లో వార్తలు, కథనాలు హల్‌చల్ చేశాయి. ఆ మేరకు శశికళ చేత నియమించబడ్డ టీటీవీ దినకరన్‌కు వివరణ ఇచ్చే అధికారం లేదని ప్రకటించారు. ఆ వివరణను పరిగణించమని, ఈనెల పదోతేదీలోపు శశికళ సంతకంతో కూడిన వివరణ సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
పరప్పన అగ్రహార చెరలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ పదో తేదీలోపు ఏ రూపంలో వివరణ ఇస్తారో అన్న చర్చ ఆ శిబిరంలో బయలు దేరింది. టీటీవీ దినకరన్ అన్నాడీఎంకేలో ఏ పదవిలోనూ లేదని, వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీలో అధికారిక పదవుల్లో ఉన్న వారికే ఉందంటూ ఎన్నికల కమిషన్ పేర్కొని ఉండడంతో పన్నీరు శిబిరంలో ఆనందం వ్యక్తం అవుతోంది. శశికళ నియామకం సైతం రద్దు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.