విచ్చలవిడిగా విదేశీ సిగరెట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశీయ సిగరెట్లకు పోటీగా విదేశీ సిగరెట్లు రాష్ట్రంలో హల్‌చల్ చేస్తున్నాయి.పైగా చట్టబద్ధమైన హెచ్చరికలను తుంగలో తొక్కినట్లుగా విదేశీ సిగరెట్లు విఫణిలో చలామణి అవుతున్నాయి.పొగతాగడ ం వల్ల ఆరోగ్యపరంగా కలిగే తీవ్ర పరిణామాలపై ఎన్నో హెచ్చరికలు చేసినా, గొంతు, నోటి క్యాన్సర్ వస్తుందంటూ సిగరెట్ ప్యాకెట్లపై భయానకమైన బొమ్మలు ముద్రించి మార్కెట్‌లోకి తెస్తున్నా దేశీ య సిగరెట్ల అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గిన దాఖలా లు లేవు. ఈ పరిస్థితిలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లుగా విఫణి వీధుల్లో విదేశీ సిగరెట్ల విశృలంఖత్వం పెరిగిపోతోంది. ఇండోనేషియన్ బ్రాండ్ సిగరెట్లు వినియోగదారుల కోసం సిటీలో సిద్ధంగా ఉన్నాయి. రెవెన్యూ ఇంటలిజెన్స్ ఇటీవల ఉత్తర చెన్నైలో ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.7 కోట్ల విలువైన ‘డీజరుమ్ బ్లాక్’ సిగరెట్లను సీజ్ చేశారు.
ఈ దాడుల తరువాత అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో సముద్రమార్గంలో విదేశీ సిగరెట్ల ప్రవేశిస్తున్నట్లు తేలింది. గతంలో విమానాల్లోని కంటైనర్ల ద్వారానే చేరవేశారు. అయితే చెన్నై, తిరుచ్చిరాపల్లి విమానాశ్రయాల కస్టమ్స్ అధికారులు కట్టుదిట్టం చేయడంతో నౌకల ద్వారా సరుకును తెప్పించుకుంటున్నారు. విమానంలో అక్రమరవాణా బంద్ కావడంతో స్మగ్లర్లు టూటుకోరిన్ పోర్టును ఎంచుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. డీజరుమ్ బ్లాక్ సిగరెట్లు దేశీయ సిగరెట్ల వలె ఎక్కువ ఘాటైనవి కాకపోవడంతో చెన్నైలోని మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
సిగరెట్ల అక్రమ రవాణాలో నూరుశాతం లాభం లభిస్తున్న కారణంగా విదేశీ సిగరెట్ల అమ్మకాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సింగపూరు, దుబాయ్, కాంబోడియా దేశాల నుంచే ఎక్కువగా విదేశీ సిగరెట్ల కంటైనర్లు చెన్నైకి చేరుతున్నట్లు సమాచారం. చెన్నైకి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలోని న్యూమనలి వద్ద రెవెన్యూ ఇంటెలిజన్స్ కొన్ని రోజుల క్రితం జరిపిన కంటైనర్ల తనిఖీలో రెండువైపులా ప్లైవుడ్ షీట్లను అమర్చి రహస్యంగా దాచి ఉంచిన 700 కార్టూన్స్ విదేశీ సిగరెట్ల సరుకు పట్టుపడగా సింగపూరు నుంచి తీసుకువచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఒక్కో కార్టూన్ 50 ప్యాకెట్ల బ్లాక్ సిగరెట్లు కలిగి ఉంటుంది. అంటే సింగపూరు నుంచి చెన్నైకి మొత్తం 70 లక్షల సిగరెట్ స్టిక్స్ అక్రమరవాణా జరిగింది అన్నమాట. సిగరెట్ స్మగ్లర్లకు తమిళనాడు ఒక అతిపెద్ద మార్కెట్‌గా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ రూ.30 వేలు నుంచి రూ.40 వేలు చెల్లించి 20 కేరియర్ల సరుకును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.