భారత్-శ్రీలంక మధ్య దశాబ్దాల తరబడి నానుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వాతావరణం నెలకొందా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత్-శ్రీలంక మధ్య దశాబ్దాల తరబడి నానుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వాతావరణం నెలకొందా? ఈలం తమిళులకు, తమిళనాడు జాలర్లకు ఊరట లభించనుందా? అనే ప్రశ్నలకు రాష్ట్రంలో అవుననే సమాధానం వస్తోంది. 28 ఏళ్ల తరువాత భారత ప్రధాని శ్రీలంక గడ్డపై కాలుమోపడం, ఆ దేశాధ్యక్షునితో శుక్రవారం జరిపిన భేటీలో ప్రధానమైన ఈ అంశాలన్నీ చోటుచేసుకోవడమే ఇందుకు కారణంగా భావించవచ్చు.
ఏళ్లుగా నానుతున్న సమస్యలు
శ్రీలంకలో స్థిరపడి, ఆక్కడే తరతరాలుగా జీవిస్తున్న ఈలం తమిళులు తమకు ప్రత్యేక హోదా లేదా రాష్ట్రం కావాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఎల్‌టీటీఈ సైతం పోరాడి సైనికపోరులో హతమైంది. ఈలం తమిళులపై శ్రీలంక సైన్యం దమనకాండను సాగించి. గృహ దహనాలు, మానభంగాలు, హత్యాకాండలతో మారణహోమం సృష్టిం చారు. వేలాది మంది మృత్యువాత పడగా, లక్షలాది మంది శ్రీలంకను వీడి భారత్‌లో శరణార్థులుగా తలదాచుకున్నారు.
ఇదిలా ఉండగా, కచ్చదీవులపై హక్కును భారత్ శ్రీలంకకు ధారాదత్తం చేయగా, గత ఆచారం ప్రకారం ఆవైపు సముద్రంలో చేపలవేటకు వెళుతున్న తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక గస్తీదళం జులుం చేస్తోంది. దాడులు చేయడం, జైళ్లలోకి నెట్టడం, మరపడవలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటివి సాగిస్తోంది. చేపల వేటనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న తమిళనాడులోని వేలాది కుటుంబాలు శ్రీలంక దాష్టీకానికి బిక్కచచ్చిపోయాయి. కచ్చదీవులను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జయలలిత ప్రభుత్వం గత ఏడాది అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈలం తమిళులు, జాలర్ల సమస్య రెండు దేశాల మధ్య రావణకాష్టంలా మండుతూనే ఉంది.
తమిళుల హక్కులకు భారత్ అండ
ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి శ్రీలంకకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ దేశాధ్యక్షుడు సిరిసేనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానిగా శ్రీలంకలో పర్యటించడం ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహాన్ని పెంచేందుకు దోహదపడగలదని విశ్వసిస్తున్నానని అన్నారు. శ్రీలంకలోని ఈలం తమిళులకు ఇతర పౌరులతో సమానహక్కు కల్పించాలని, తమిళ జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని సిరిసేనను కోరినట్లు చెప్పారు. మత్య్సకారుల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్లు చెప్పారు. శ్రీలంకలోని జాలర్ల ప్రతినిధులు తనను కలిశారని తెలిపారు.
ఈలం తమిళులకు సమానహక్కు అంశంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈలం తమిళులకు సమానహక్కుపై ఇప్పటికే చట్టంలో సవరణలు చేసి ఉన్నారని, ఆయితే వాటిని నిర్ధిష్టంగా, నిబద్ధతతో అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన సమస్యలు కావడంతో పరిష్కారం కనుగొనేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన అన్నిరకాల సహకారం భారత్ అందిస్తుందని తాను సిరిసేనతో చెప్పినట్లు తెలిపారు. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ఈలం తమిళులకు, తమిళనాడు జాలర్లకు పునర్జన్మను ప్రసాదిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు.