ఒకే రోజు నాలుగు ‘పరీక్ష’లు
► 23న రాష్ట్ర పోలీసు, సీఆర్‌పీఎఫ్, సీడీఎస్, ఐబీపీఎస్ పరీక్షలు
► పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదాకు అభ్యర్థుల విజ్ఞప్తులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నాలుగు వేర్వేరు ఉద్యోగాల రాత పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రెండు, అంతకంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలోని పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష జరగనుంది.
అదే రోజు సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ రాత పరీక్ష ఉదయం 8-11 గంటల మధ్య జరగనుండగా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్ష ఉదయం 9-12 గంటలకు, ఐబీపీఎస్ పీఓ/ఎంటీ రాత పరీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షకు హాల్‌టికెట్లు పొందిన అభ్యర్థులు.. సీఆర్‌పీఎఫ్, ఐబీపీఎస్, సీడీఎస్ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదని కొందరు అభ్యర్థులు పేర్కొన్నారు.