బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి ఒంటి గంట వరకు పొడిగించడంతో నగర వాసులు కొత్త అనుభవాన్ని చవి చూశారు.
బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి ఒంటి గంట వరకు పొడిగించడంతో నగర వాసులు కొత్త అనుభవాన్ని చవి చూశారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శుక్రవారం ‘స్వేచ్ఛ’ లభించినట్లుగా అనుభూతిని పొందారు. అయితే బార్ల యజమానుల్లో నెలకొన్న గందరగోళం, ప్రజల్లో అవగాహనా లోపం వల్ల తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది.
చాలా వరకు బార్లు యధావిధిగా 11 గంటలకే మూతపడ్డాయి. రాత్రి సమయం పొడిగింపుపై అవగాహన కలిగిన మందు బాబులు మాత్రం జల్సా చేశారు. తొలి రోజు బాగా వ్యాపారం జరుగుతుందనే అంచనాతో ఉత్సాహంతో ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని పలువురు బార్ యజమానులు తెలిపారు. సమయం పొడిగింపు గురించి తెలియని చాలా మంది అర్ధ రాత్రికే ఇంటికి చేరుకున్నారని చెప్పారు. అయితే మున్ముందు ‘మంచి రోజులు’ ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
నగరంలోని చాలా మంది బార్ల యజమానులు తమ రెగ్యులర్ కస్టమర్లకు సమయం పొడిగింపుపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ‘అవగాహన’ కల్పించారు. కాగా అనేక మంది మందు ప్రియులు తొలి రోజున బాగా ఎంజాయ్ చేయడానికి ‘లేట్ నైట్ పార్టీ’పై మిత్రులకు ఫేస్ బుక్‌లో ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు.
హడావుడి తప్పింది
వివిధ రంగాల్లోని యువత సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. కాసేపు గడిపాక బార్లకు దారి తీస్తుంటారు. గంటల తరబడి బార్లలో కాలక్షేపం చేసే వారికి 11 గంటల గడువు మింగుడు పడకుండా ఉండేది. వారంతా ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాత్రి పొద్దు గడిచే కొద్దీ బార్ల వైపు మళ్లే వారు కొందరైతే, మిత్రులందరినీ కలుపుకొని వెళ్లే వారు మరికొందరు. ఇలాంటి స్వేచ్ఛా జీవులకు పొడిగింపు సమయం వరంలా పరిణమించింది. రాత్రి 11 గంటల వరకు డ్యూటీలలో ఉండే వారు సైతం కొత్త పొడిగింపు వేళలతో సంబర పడిపోతున్నారు. హోటళ్లను 11 గంటలకే మూసివేయడంతో చాలా మంది కడుపు మాడ్చుకునో లేక ఇంటిలో తయారు చేసుకునే అల్పాహారంతోనో కడుపు నింపుకునే వారు.
అలాంటి వారికి ఇప్పుడు కోరిన ఆహారం లభిస్తుంది. హోటళ్లు, తిను బండారాల కేంద్రాలు మాత్రం వారమంతా రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయి. మరో వైపు బర్త్ డే పార్టీలు జరుపుకొనే వారికి కూడా ఈ పొడిగింపు సమయం సంబరాన్ని కలిగిస్తోంది. సాధారణంగా బార్లలో ఇలాంటి పార్టీలు జరుపుకొనే వారు 11 గంటల లోగా సంబరాలను ముగించాల్సి ఉంటుంది. అంటే...గంటకు ముందే పుట్టిన రోజు జరుపుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడా ఇబ్బంది తప్పిందని అనేక మంది ఉత్సాహ పడుతున్నారు.