
విద్యాసాగర్‌రావుకే ఇక పూర్తి బాధ్యత?
చెన్నై : తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఇక, పూర్తి బాధ్యతలు అప్పగించేనా అన్న ప్రశ్న మొదలైంది. ఇందుకు తగ్గ కసరత్తులు ఢిల్లీలో సాగుతున్నట్టుగా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇక, హిజ్ ఎక్సలెన్సీ అన్న పదాన్ని వాడొద్దు అని, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అంటూ విద్యాసాగర్‌రావు ఆదేశాలతో రాజ్‌భవన్ ప్రకటన జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసినానంతరం ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతల్ని విద్యాసాగర్‌రావు స్వీకరించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర గవర్నర్‌గా పూర్తి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, ఇన్‌చార్జ్‌గా తమిళనాడు గవర్నర్‌గా అదనపు భారాన్ని తన భుజాన విద్యాసాగర్‌రావు మోస్తూ వచ్చారు. అయితే, ఇక్కడ పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాల్సిన అవసరం ఉండడంతో, పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆచరణలో సాధ్యమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ పేరు ఖరారైనట్టుగా ప్రచారం కూడా సాగింది. అయితే, ఇతరులకు కొత్తగా పూర్తి బాధ్యతల్ని అప్పగించడం కన్నా, ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పూర్తి బాధ్యతల్ని అప్పగించే దిశలో ఢిల్లీ స్థాయిలో కసరత్తులు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఇక, పూర్తి స్థాయిలో గవర్నర్ పగ్గాలు విద్యాసాగర్‌రావుకు అప్పగించినట్టే అన్నట్టుగా తమిళ మీడియా వార్తలు, కథనాలను వెలువరించే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ వార్తలు, కథనాలకు బలం చేకూరే రీతిలో రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడడం గమనార్హం. సాధారణంగా గవర్నర్ పేరుకు ముందుగా హిజ్ ఎక్సలెన్సీ అన్న పదాన్ని ఉపయోగించడం జరుగుతూ వస్తున్నది. అయితే, ఇక ఆ పదాన్ని ఉపయోగించ వద్దు అని, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అన్నట్టుగా ఆ ప్రకటన వెలువడడం విశేషం. ప్రభుత్వ వ్యవహారాలు, కార్యక్రమాలు సంబంధించిన లేఖలు తదితర అంశాల్లో గౌరవనీయులు అని వాడితే చాలు అని సూచించడం గమనార్హం.