అధిష్టానంపై ఆగ్రహం
Published Mon, Mar 10 2014 11:47 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: యూపీఏ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ అధిష్టానంపైనా కేంద్ర మంత్రి జీకే వాసన్ నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగలడానికి అధిష్టాన వైఖరే కారణమని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర సమస్యలను వివరించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సోమవారం ఢిల్లీలో కలుసుకున్న జీకే వాసన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సముద్రంలో చేపల వేటపై శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య ఏళ్లతరబడి నలుగుతున్న సమస్య, శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించడంలో చొరవ చూపకపోవడం, శ్రీలంక ఆధీనంలో ఉన్న తమిళ జాలర్ల పడవలను విడిపించకపోవడం వంటి అనేక సమస్యలపై యూపీఏ ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంభించిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఉదాశీన వైఖరితో వ్యవహరించడం అవస్థల పాల్జేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో వేగంగా తీసుకోవలసిన నిర్ణయాలపై జరుగుతున్న జాప్యం రాష్ట్రంలో ప్రచార వ్యూహ రూపకల్పనకు అవరోధమైందని అన్నారు. కాంగ్రెస్ గెలుపునకు ఇంత వరకు దిశానిర్దేశనమే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రాలేదని అన్నారు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని, ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు తమకు గెలుపును ప్రసాదిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ జాబితాపై కసరత్తు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు తప్పదని దాదాపుగా తేలిపోవడంతో పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక పనిలో పడింది. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్, ముకుల్‌వాస్నిక్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత, హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్ బృందం ఢిల్లీలో మంగళవారం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 39 స్థానాలకు 1200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1ః5 నిష్పత్తి ప్రకారం ఒక్కో నియోజకవర్గానికి అభ్యర్థుల జాబితాను ఈనెల 11వ తేదీన ఢిల్లీలో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సాయంత్రానికి జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పుదుచ్చేరిలోని ఒక స్థానానికి కూడా అభ్యర్థిని నిలిపే యోచనలో కాంగ్రెస్ ఉంది.
Advertisement