ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల రద్దీ కారణంగా జాతీయ రాజధాని రహదారులు ఇరుకుగా మారుతున్న నేపథ్యంలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎనిమిది సంవత్సరాల క్రితం ఈస్ట్రన్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ) ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అప్పటినుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.
గ్రేటర్ నోయిడా: ఈస్ట్రన్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ) ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈఈపీ నిర్మాణానికి గ్రేటర్ నోయిడా అధికార యంత్రాంగం ప్రణాళికలను రూపొందించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని వివిధ నగరాలను అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు అప్పట్లో రూపకల్పన చేశారు. ఇది జాతీయ రాజధాని మీదుగా సాగుతుంది. దీని పొడవు 135 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జాతీయ రాజధానిలోని రహదారులపై ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోతాయి. ఇందువల్ల ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. కాగా ఈపీఈ ప్రాజెక్టుకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టువల్ల గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, సోనిపట్, ఫరీదాబాద్, పల్వాల్‌లతోపాటు ఢిల్లీ రహదారులకు వాహనాల రద్దీ నుంచి కొంతమేర విముక్తి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే దీని వెంబడి వాణిజ్య భవనాలతోపాటు టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందే అవకాశముంది. ఇందువల్ల అనేకమందికి ఉపాధి లభిస్తుంది.
ఆరు ప్యాకేజీలుగా విభజన
ఈస్ట్రన్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ) పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) దీనిని మొత్తం ఆరు ప్యాకేజీల కింద విభజించింది. ఆరు సంస్థలనుంచి టెండర్లను స్వీకరించింది. వచ్చే నెల నాలుగో తేదీలోగా వీటిని ఖరారు చేయనుంది. ఈ మార్గం ఢిల్లీ నగరానికి తూర్పు దిశగా ముందుకుసాగుతుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ దాదాపు లక్షమంది వినియోగించుకుంటారని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
ఈపీఈకి ఎనిమిదేళ్ల తర్వాత మోక్షం
Published Sun, Nov 2 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement