
ఎడపాడికి ఎదురుదెబ్బ!
♦ మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వం
♦ అదృష్ట సంఖ్యకు ఆమడదూరం
♦ గోడ దూకకుండా దినకరన్ జాగ్రత్తలు
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్గ పోరు, అసంతృప్తివాదులతో ఊగిసలాడుతున్న ఎడపాడి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అదృష్ట సంఖ్యకు ఆమడ దూరంలో ఉండే ఈ సర్కారు ఉండేనా ఊడేనా అనే చర్చ మొదలైంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్నీరు కలయికతో సంబరపడ్డ పళని స్వామికి వెంటనే షాక్ తగిలింది. దీంతో ప్రభుత్వం పరిస్థితే అయోమయంలో పడిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో 32 ఏళ్లపాటూ వెన్నంటి నిలిచిన శశికళ జయ మరణం తరువాత పార్టీ, ప్రభుత్వం ఇక తన చెప్పు చేతుల్లోనే అని ఆశించారు. ఆమె ఆశించినట్లుగానే కొన్నాళ్లు సాగింది. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన నాటి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.
శశికళ జైలు కెళ్లడం, తన ప్రతినిధిగా నియమితుడైన దినకరన్ సైతం పార్టీకి పూర్తిగా దూరం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారని భావిస్తూ వచ్చిన దినకరన్ మద్దతుదారుల సంఖ్య 19కి పడిపోయింది. ఎడపాడి, పన్నీర్ ఏకం కావడం శశికళ వర్గాన్ని మరింతగా బాధించింది. శశికళ సుదీర్ఘ రాజకీయ ఎత్తుగడలతో చేజిక్కించుకున్న అన్నాడీఎంకేలోనూ, ప్రభుత్వంలోనూ తమకు స్థానం లేకపోవడం ఏమిటని దినకరన్ వర్గం ప్రశ్నించడం ప్రారంభించింది. 22 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న తమను కాదని 11 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన పన్నీర్‌ను అక్కున చేర్చుకోవడం ఏమిటని నిలదీసింది.
నాడు కూవత్తూరు.. నేడు పుదుచ్చేరి
జయ మరణం, పన్నీర్‌సెల్వం తిరుగుబాటు, దినకరన్ కుట్రలతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా నెలలుగా ఊగిసలాడుతోంది. ఎడపాడి, పన్నీర్ వర్గాల విలీనంతో ప్రభుత్వం మరింత సంక్లిష్ట దశలో పడిపోయింది. ఐదుగురు ఎమ్మెల్యేల కోసం ఎడపాడి ఎత్తువేసేలోగా ముందుగానే చిత్తు చేయాలని దినకరన్ వేగంగా కదిలారు. విలీనం అయిన మరుసటి రోజునే 19 మంది ఎమ్మెల్యేల చేత ఖంగు తినిపించారు. అంతేగాక తన వైపున గట్టిగా నిలిచి ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం తిరుగుబాటు సమయంలో మహా బలిపురం సమీపం కూవత్తూరులో శశికళ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలను నడిపించి సఫలీకృతులైనారు. ఆ అనుభవాన్ని ఒంటబట్టించుకున్న దినకరన్ మంగళవారం ఒక ప్రత్యేక బస్సులో పుదుచ్చేరికి తరలించారు. డీఎంకే అవిశ్వాస పరీక్ష పెట్టడం లేదా, గవర్నరే బలపరీక్షకు ఆదేశించడం పూర్తయితేగానీ 19 మంది ఎమ్మెల్యేలకు విముక్తి ఉండదని సమాచారం.