సాక్షి, ముంబై: ముంబై , ఠాణే, కొంకణ్‌లలో మహాకూటమి మళ్లీ తన పట్టు నిలుపుకుంది. ఈ ప్రాంతాలు శివసేన, బీజేపీలకు పెట్టనికోటగా ఉండేవి. అయితే గత ఎన్నికల్లో పట్టు కోల్పోయినప్పటికీ తాజా ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకుని రికార్డును సృష్టించాయి. దీంతో శివసేన, బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ముంబైలో...: ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమిని శివసేన, బీజేపీలు మట్టి కరిపించాయి. 2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు పూర్తి భిన్నంగా ఈసారి ఫలితాలు వెలుపడ్డాయి. గతంలో ముంబైలోని ఆరు స్థానాలలో కాంగ్రెస్ ఐదు, ఎన్సీపీ ఒకటి ఇలా మొత్తం ఆరు స్థానాలనూ దక్కించుకున్నాయి. అయితే ఈసారి మాత్రం ఖాతా తెరవలేకపోయాయి. ముంబైలో పోటీ చేసిన ప్రముఖనాయకులు కూడా పరాజయం పాలయ్యారు. ముంబైలోని ఆరు స్థానాలలో శివసేన, బీజేపీలు చెరో మూడు సీట్లను కైవసం చేసుకున్నాయి. విజయం సాధించిన శివసేన అభ్యర్థులలో దక్షిణ ముంబై నుంచి అరవింద్ సావంత్, దక్షిణ మధ్య ముంబై నుంచి రాహుల్ శెవాలే, వాయవ్య నుంచి గజానన్ కీర్తికర్‌లున్నారు.
విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులలో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పూనమ్ మహాజన్, ఈశాన్య ముంబై నుంచి కిరీట్ సోమయ్య, ఉత్తర ముంబై నుంచి గోపాల్ శెట్టిలున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులైన ప్రియాదత్, ఏక్‌నాథ్ గైక్వాడ్, మిలింద్ దేవరా, సంజయ్ నిరుపం, గురుదాస్ కామత్‌లు పరాజయం పాలయ్యారు.
ఠాణేలో...: ఠాణేలో కూడా మహాకూటమి తన విజయపరంపరను కొనసాగించింది. ఠాణేలోని మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో శివసేన రెండు, బీజేపీ రెండు గెలుచుకోవడం ద్వారా మహాకూటమి రికార్డు సృష్టించింది. ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి రాజన్ విచారే విజయం సాధించారు. ఎన్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అయిన సజీవ్ నాయిక్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు భివండీలో బీజేపీ అభ్యర్థి కపిల్ పాటిల్ విజయం సాధించగా పాల్ఘర్ బీజేపీ అభ్యర్థి చింతామణి వన్‌గా, కల్యాణ్‌లో శివసేన అభ్యర్థి శ్రీకాంత్ షిండేలు గెలుపొందారు.
కొంకణ్‌లో...: కొంకణ్‌లోని రాయ్‌గఢ్, రత్నగిరి-సింధుదుర్‌గ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు శివసేన ఈసారి తన పట్టును నిలుపుకుంది. రత్నగిరి-సింధుదుర్‌గ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన నారాయణ్ రాణే కుమారుడు నీలేష్ రాణేపై శివసేనకు చెందిన వినాయక్ రావుత్ విజయం సాధించారు. మరోవైపు రాయ్‌గఢ్‌లో కూడా ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తట్కరేపై శివసేన అభ్యర్థి అనంత్‌గీతే విజయం సాధిం చారు. ఇలా కొంకణ్‌లో కూడా తాను కోల్పోయిన స్థానాలను శివసేన తిరిగి కైవసం చేసుకుంది.
పట్టు నిలుపుకొన్న మహాకూటమి
Published Fri, May 16 2014 10:17 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement