ఏటీఎంలకు భద్రత ఏదీ?
Published Wed, Nov 27 2013 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
ఏటీఎంల భద్రతా వ్యవహారం కోర్టుకు చేరింది. మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనంలో దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారణకు స్వీకరించింది. దేశంలో ఉన్న ఏటీఎంల భద్రతపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి, రిజర్వు బ్యాంక్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
సాక్షి, చెన్నై:ఏటీఎంలకు, ఖాతాదారులకు భద్రత కరువు అవుతోంది. ఏటీఎంలను పగులకొట్టి చోరీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో దోపిడీలు, నకిలీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఖాతాల్లోని నగదు దోచేస్తున్న ఘటనలు ఇన్నాళ్లు వెలుగు చూస్తూ వచ్చాయి. ఈ కేసుల ఛేదింపులు పోలీసులకు పెనుసవాల్‌గా మారింది. ఏటీఎంల వద్ద కొరవడుతున్న భద్రత నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నేరగాళ్ల కదలికలపై కొరడా ఝుళిపించే పనిలో పోలీసు యంత్రాంగం ఉన్నది. ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఆయా బ్యాంకులకు సూచిస్తూ వస్తున్నారు. అయినా, ఫలితం శూన్యం.
ప్రధాన నగరాల్లోని ఏటీఎంలకు భద్రత ఉన్నా, శివారుల్లో అంతంత మాత్రమే. మరి కొన్ని చోట్ల ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డు ఉంటే ఒట్టు. కొన్ని చోట్ల ఉన్నా, రాత్రి తొమ్మిది కాగానే ముసుగేసుకుని నిద్ర పోవడం పరిపాటి. ఏదేని ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, బ్యాంకు అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఈ పరిస్థితుల్లో ఏటీఎంలకే కాదు, నగదు తీసుకునేందుకు వచ్చే వారికీ భద్రత లేదన్నట్టుగా బెంగళూరు ఘటనతో తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా ఏటీఎంలకు భద్రత వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోనూ ఆయా జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం బ్యాంకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఏటీఎంలకు కల్పించాల్సిన భద్రతపై హెచ్చరికలు జారీ చేస్తోంది.
కోర్టులో పిటిషన్
ఏటీఎంలకు, ఖాతాదారులకు కొరవడుతున్న భద్రతపై మదురైకు చెందిన ఆనందరాజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఏటీఎంలలో జరుగుతున్న చోరీలు, సెక్యూరిటీల నిర్వాకం, కొన్ని చోట్ల సెక్యూరిటీలు లేరన్న వివరాలను తన పిటిషన్‌లో పొందుపరిచారు. ఏటీఎంలకు భద్రత ఏదీ..? అని ప్రశ్నిస్తూ కొన్ని సూచనల్ని అందులో పేర్కొన్నారు. ఏటీఎం లోపల మాత్రమే కాకుండా ఆ పరిసరాల్లోను నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని, ఏటీఎంలలో హెచ్చరికల అలారం ఏర్పాటు చేయాలని, దీనిని ఆయా ఏటీఎంల పరిధుల్లోని పోలీసు స్టేషన్లకు అనుసంధానించాలని పలు సూచనలు ఇచ్చారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోపు ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వుబ్యాంకుకు నోటీసులు జారీ చేసింది.
Advertisement
Advertisement