హీరోయిన్‌ను రక్షించిన హీరో
షూటింగ్ స్పాట్‌లో హీరోయిన్‌ను కారులో ఎక్కించుకుని తీసుకుపోయిన రౌడీమూకను హీరో ఛేజ్ చేసి కాపాడారు. ఇది రీల్ సీన్ కాదు రియల్ సంఘటన అంటున్నారు దర్శకుడు లాలి. కన్నడ నటుడు రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఐదు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అరియామై. షారోన్ గ్రూప్స్ పతాకంపై రాజ్ నిర్మించి హీరోగా నటించిన ఈ చిత్రంలో కన్నడ నటి కావ్య హీరోయిన్‌గా నటించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ముగ్గురు యువకుల పరిచయం స్నేహంగా మారుతుందన్నారు.
ఆ ముగ్గురు అనూహ్యంగా ఒక సమస్యను ఎదుర్కొంటారని అందులో నుంచి బయటపడటానికి వారికి ఒక ఎమ్మెల్యే సాయం అవసరం అవుతుందన్నారు. ఆయన పంచన చేరిన వారి జీవితం ఎటు వైపు మళ్లిందన్నదే చిత్రం కథ అన్నారు. చిత్ర షూటింగ్‌ను మైసూరు - బెంగుళూరు హైరోడ్డులో నిర్వహిస్తుండగా అనూహ్యంగా కారులో వచ్చిన రౌడీమూక హీరోయిన్‌ను ఎత్తుకుపోయారన్నారు.
చిత్ర యూనిట్‌కు ఏం జరిగిందో అర్థం అయ్యేలోపు ఆ కారు రయ్‌మని దూసుకుపోయిందన్నారు. ముందుగా తేరుకున్న చిత్ర హీరో రాజ్ విలన్, నటుడు ప్రతాప్ మరో కారులో రౌడీల కారును ఛేజ్‌చేసి మైసూర్ సమీపంలో పట్టుకుని వారి నుంచి హీరోయిన్‌ను రక్షించారని దర్శకుడు తెలిపారు. డీఎన్ దివాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కెవి స్టూడియోలో నిర్వహించారు.