సాక్షి, న్యూఢిల్లీ:ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న సంజీవ్ చతుర్వేదిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. అవినీతి క్యాన్సర్‌పై పోరాటం చేస్తానని ప్రధాని ప్రకటిస్తుండగా, అనేక కుంభకోణాలను బయటపెట్టి నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్న అధికారిని హఠాత్తుగా పదవి నుంచి తొలగిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది.బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేత చెప్పడం వల్ల తనను బదిలీచేశారని సంజీవ్ చతుర్వేది అంటున్నారు. ఆయన తన బదిలీని వ్యతిరేకిస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాయడమేకాక లేఖప్రతులను ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు.
బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేత వ్యక్తిగత వైద్యుని సలహా మేరకు తనను పదవి నుంచి తొలగించారని, ఆ వైద్యునిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తాను దర్యాప్తు చేయడమే ఇందుకు కారణమని చతుర్వేది ఆ లేఖలో పేర్కొన్నారు.వాస్తవానికి 2016 జూలై వరకు చతుర్వేది సీవీవో పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు అందాయి. ఆరోగ్యశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న విశ్వాస్ మెహతాను చతుర్వేది స్థానంలో మూడు నెలల పాటు సీవీవోగా నియమించారు. ఎయిమ్స్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఫ్యాక్టల్టీ సభ్యులపై అవినీతి కేసులను దర్యాప్తు చేయడంవల్ల చతుర్వేదిని తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.కాగా, చతుర్వేది బదిలీ వెనుక బిజెపి ప్రధాన కార్యదర్శ జె.పి.నడ్డా హస్తముందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
హర్యానా కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ అధికారి అయిన సంజీవ్ చతుర్వేదికి రాజకీయ నాయకుల వ్యతిరేకత , బదిలీలు కొత్త కాదు. ఐదేళ్లలో ఆయనను 12 సార్లు బదిలీ అయ్యారు. ఎయిమ్స్‌లో సీవీవోగా ఆయన జూన్ 2012లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లపాటు ఆ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పిస్తూ నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.గత రెండేళ్లలో ఎయిమ్స్‌లో జరిగిన అనేక అవకతవకలను చతుర్వేది బయటపెట్టారు. దాంతో అక్కడి నుంచి ఆయనను తొలగించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అత్యంత నిజాయితీపరుడైన చతుర్వేదిని పదవిలో కొనసాగించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించడంతో పార్లమెంటరీ కమిటీతో పాటు ప్రధాని కార్యాలయం ఆయనను పదవిలో కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశాయి .
చతుర్వేదిని తొలగించడానికి తీసుకునే నిర్ణయమేదైనా ఉంటే దానిని క్షుణంగా పరిశీలించాలని కేబినెట్ సెక్రటరీని ఆదేశించడమే కాక ఈ విషయాన్ని పీఎంఓకు తెలియచేయాలని ప్రధాని కార్యాలయం గత నవంబర్‌లో ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఈ విషయాలన్నింటినీ బేఖాతరు చేస్తూ చతుర్వేదిని బదిలీచేస్తూ ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. బీజేపీ జనరల్ సెక్రటరీ జెపి నడ్డా ఏడాదిగా సీవీవో పదవి నుంచి చతుర్వేదిని తొలగించడానికి యత్నిస్తున్నారని, ఆయన ఈ విషయమై గతంలో సిబ్బంది, శిక్షణ విభాగానికి కూడా రెండుసార్లు లేఖ రాశారని అంటున్నారు. ఎయిమ్స్‌లో సీవీవో పోస్ట్ లేదని, చతుర్వేది నియామకంలో అవకతవకలు జరిగాయని నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాశారని బీజేపీ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా చతుర్వేది బదిలీ వెనుక తన హస్తం లేదని నడ్డా వివరణ ఇచ్చుకున్నారు. కాగా, తాను దర్యాప్తు చేసిన అవినీతి కేసులను సిబిఐకి అప్పగించాలని ప్రధానికి రాసిన లేఖలో చతుర్వేది సూచించారు. అలాగే ప్రధాన కార్యాలయం, పార్లమెంటరీ కమిటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తన బదిలీకి ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని ఆయన డిమాం డ్ చేశారు. చతుర్వేది రాసిన ఈ లేఖ ఎయిమ్స్‌తో పాటు ఆరోగ్య మంత్రిత్వశాఖలో కలకలం సృష్టిం చింది. ప్రస్తుతం చతుర్వేది సెలవుపై ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఎయిమ్స్ సీవీవోగా చతుర్వేది ఎయిమ్స్‌లో వెలికి తెచ్చిన కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఉపక్రమించింది. చతుర్వేది వెలికితెచ్చిన కుంభకోణాల్లో సెక్యూరిటీ గార్డులు, నకిలీ సిబ్బంది నియామకాలు, మందుల కొనుగోలులో జరుగుతోన్న అవకతవకలు వంటివి ఉన్నాయి, స్పెషాలిటీ క్యాన్సర్ సెంటర్‌లో ఓ అడిషనల్ డైరక్టర్ తన పెంపుడుకుక్కకు ఆపరేషన్ చేయించిన వైనం కూడా ఆయన దర్యాప్తులో బయటపడింది. చతర్వేది బదిలీని ప్రశ్నించిన ఆప్: సంజీవ్ చతుర్వేదిని బదిలీచేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.. నిజాయితీపరుడైన అధికారిని ఎందుకు బదిలీచేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ చర్యను ప్రశ్నించింది. ఈ బదిలీ అక్రమమని ఆరోపించింది.
‘బదిలీ’ లొల్లి..!
Published Thu, Aug 21 2014 10:11 PM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement