వైఫల్యాలు నిజమే!
వైఫల్యాలు నిజమే!
Published Sat, Feb 1 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
న్యూఢిల్లీ: భేజా ఫ్రై, ఖోస్లా కా ఘోస్లాలో రణ్‌వీర్ షోరే అద్భుతంగా నటించి హాస్యం సృష్టించినా అవేవీ మనోడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. హిందీ సినీపరిశ్రమలో తాను తగినన్ని విజయాలు సాధించని మాట నిజమేనని అంటున్నాడు. అందుకు బాధేమీ లేదని, కొన్నిసార్లు కాలం కలిసి రాకపోవచ్చని చెప్పాడు. తన కెరీర్‌లో ఎన్ని వైఫల్యాలు ఉన్నా, విజయాలతో పోలిస్తే వాటి సంఖ్య తక్కువేనని ఈ 41 ఏళ్ల నటుడు అన్నాడు. ఇక నుంచి మరిన్ని మంచి కథలు ఎంచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన షోరే, ఇప్పటి వరకు ఎంచుకున్న వాటిలో హాస్యపాత్రలే ఎక్కువ. ‘హాస్యం నాకు సహజసిద్ధంగానే వచ్చిందనుకుంటా. నా హాస్యాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కాబట్టే పాత్రలూ ఇలాంటివే దక్కుతున్నాయి.
నవ్వించే పాత్రలు కొనసాగించడానికి ఇబ్బంది కూడా ఏం లేదు’ అని స్పష్టం చేశాడు. సింగ్ ఈజ్ కింగ్, చాందినీచౌక్ టు చైనా వంటి సినిమాల్లో షోరే కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రముఖ నటి కొంకణాసేన్‌ను పెళ్లాడినా, తామిద్దరం సినిమాల గురించి మాట్లాడేది చాలా తక్కువని ఇతడు చెబుతాడు. ‘సినిమాలే కాదు మేం పట్టించుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉంటాయి. కొడుకు హరూమ్‌తో ఇంట్లో చాలా సేపు గడుపుతాం. స్నేహితుల ఇళ్లకు భోజనాలకూ వెళ్తుంటాం. స్నేహితుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎప్పుడూ బిజీగా ఉంటాను’ అని షోరే వివరించాడు. సాహసాలు, పోరాటాల నేపథ్యంగా సాగే ఖత్రోకా కే ఖిలాడీ 5 టీవీ షోలోనూ ఇతడికి అవకాశం దక్కింది. ఇది కాస్త ప్రమాదకరమైన షో కాబట్టి నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కొంకణ హెచ్చరించిందని చెప్పాడు. రణ్‌వీర్ షోరే మాత్రం షోలో పాల్గొనాలనే నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్‌లో ప్రసారమవుతుంది.
Advertisement
Advertisement