వరంగల్-హైదరాబాద్ రహదారిపై భారీ ట్రాఫిక్‌జాం
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మోటకొండూరు గ్రామస్థులు రాస్తోరోకో నిర్వహిస్తుండటంతో.. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యాదగిరిగుట్ట మండలంలో గల చిన్న కందుకూరు, చొల్లేరు, మహబూబ్‌పేటలతో పాటు భువనగిరి మండలంలోని ముస్తాలపల్లి, చిమాలకొండూర్ గ్రామాలను నూతనంగా ఏర్పడుతున్న మోటకొండూర్ మండలంలో కలపాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.