నటుడిగా సక్సెస్ అయ్యాను
నటుడిగా సక్సెస్ అయ్యాను. నిర్మాతగా నాకిది తదుపరి ఘట్టంఅంటున్నారు నటుడు అరుణ్ విజయ్. ఇంతకు ముందు కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన ఈయన ఇటీవల ఎన్నై అరిందాల్ చిత్రంలో అజిత్‌కు ప్రతినాయకుడిగా నటించి విలక్షణ నటుడిగా విశేష ఆదరణ పొందారు. అరుణ్ విజయ్ హీరోగా నటించిన వాడీల్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో కార్తీక హీరోయిన్‌కాగా ఈ నటుడిప్పుడు నిర్మాత కానున్నారు. ఇన్ సినిమాస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ (ఐసీఈ)పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తండ్రి విజయకుమార్, భార్య మొదలగు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం స్థానిక రాయపేటలోని రష్యన్ సెంటర్ హాలులో చిత్ర నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు. అరుణ్ విజయ్ మాట్లాడుతూ చిత్ర నిర్మాణం చేపట్టాలన్నది తన చిరకాల కోరిక అన్నారు.
నటుడిగా జయించాను. నిర్మాతగా కూడా ప్రతిభావంతులైన నవ దర్శకులు,నటులను ప్రోత్సహించాలన్న ధ్యేయంతోనే ఈ సంస్థను ప్రారంభించానని పేర్కొన్నారు. తాను నటించిన వాడీల్ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో గానీ అక్టోబర్ తొలి వారంలో గానీ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తేజతో కలిసి బ్రూస్‌లీ చిత్రంలోనూ,కన్నడంలో పునీత్‌రాజకుమార్‌తో చక్రవ్యూహ చిత్రంలోనూ నటిస్తున్నానని తెలిపారు. ఇలా ఇతర భాషా చిత్రాల్లో నటించడం ఇదే ప్రప్రథం అన్నారు. కొత్త చిత్రాలేమీ ప్రస్తుతానికి ఒప్పుకోలేదని కథా చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.ఎన్నై అరిందాల్ చిత్రంలో మాదిరిగా ఇకపై కూడా విలన్‌గా నటిస్తారా? అని అడుగుతున్నారని అయితే ఒక మంచి దర్శకుడి చిత్రంలో నటించాలన్న కోరికతోనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎన్నై అరిందాల్ చిత్రంలో నటించానని అరుణ్ విజయ్ వివరించారు.