చెప్పాల్సింది చెప్పేశా: రజనీకాంత్
చెన్నై: అభిమానులతో మూడురోజులపాటు భేటీ అనంతరం కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలకు పుల్‌స్టాప్ పడటంలేదు. రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని రజనీకాంత్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఆయన చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఐదు రోజులపాటు జిల్లాల వారీగా అభిమానులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.
అయితే తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై రజనీకాంత్ స్పందిస్తూ... తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదన్నారు. మరోవైపు అభిమానులతో భేటీ సందర్భంగా... ఈ సమావేశంలో వేదికపై అమర్చిన ఒక చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ‘బాబా’ చిత్రంలో రజనీకాంత్ తన కుడిచేతి వేళ్లను చిత్రంగా మడిచి చూపుతుంటారు. తెల్లని కలువపువ్వులో అదే తరహాలో చేతివేళ్లు చిహ్నంగా తీర్చిదిద్ది ఫ్లెక్సీలో అమర్చారు.
ఈ సింబల్‌పై తాజాగా చర్చలు జోరందుకున్నాయి. రజనీకాంత్ బీజేపీకి దగ్గర అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కమలం గుర్తుతో పాటు కుడిచేతి వేళ్లను మడిచి చూపుతున్న ముద్రను ఎంచుకున్నారని, అదే ఆయన పార్టీ సింబల్ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ వేదికపై ఏర్పాటు చేసిన గుర్తుపై తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది.