రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ...?
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై మళ్లీ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఒత్తుళ్లు వచ్చినా ఇప్పటివరకూ తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాను రాజకీయాల్లోకి వస్తానని కానీ రానని కాని రజనీకాంత్ ప్రకటించలేదు. అయితే రజనీకాంత్ సతీమణి లత నిన్న చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశమైంది.
రజనీకాంత్ రాజకీయాల్లో వచ్చే అవకాశాలు లేకపోలేదని, సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని ఆమె అన్నారు. దీంతో మరోసారి రజనీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వచ్చేనెల 2వ తేదీన అభిమానులతో చెన్నైలో సమావేశం కానున్నారు. అభిమానుల సమావేశంలో రజనీకాంత్... ఓ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
కాగా రజనీకాంత్ గతంలో బీజేపీలో చేరుతారంటూ వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అంతకు ముందు ఆయన సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. పలువురు ప్రముఖులు స్వయంగా కలసి, మరికొందరు బహిరంగం ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయితే వస్తానని కానీ రానని కాని రజనీకాంత్ ప్రకటించలేదు. మరోవైపు జయలలిత మరణం అనంతరం రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై గట్టి చర్చ జరుగుతోంది. దీంతో రజనీకాంత్ అభిమానులతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.