డీఎంసీ సభ్యుల నియామకంపై హైకోర్టు స్టే | IMA hails HC stay on DMC notification | Sakshi
Sakshi News home page

డీఎంసీ సభ్యుల నియామకంపై హైకోర్టు స్టే

Published Thu, Mar 19 2015 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

IMA hails HC stay on DMC notification

న్యూఢిల్లీ: ఢిల్లీ మెడికల్ కౌన్సిల్(డీఎంసీ) సభ్యుల నియామకాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. వివరాలు.. కౌన్సిల్ పదవీ కాలం గతేడాది డిసెంబర్‌లో ముగియబోతుండటంతో నవంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉండటంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ నలుగురు డాక్టర్లను కౌన్సిల్‌కి నామినేట్ చేశారు. అప్పుడు నామినేట్ అయిన వారిలో అంబరీష్ మిథల్(ఎండోక్రినోలజిస్టు వైద్యుడు), మనోజ్ కె.సింగ్(ఎయిమ్స్ ప్రొఫెసర్), వినయ్ అగర్వాల్(ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు), రవి మాలిక్(పిడియాట్రిషన్) ఉన్నారు. అయితే, తాజాగా ప్రభుత్వం 22 మంది డాక్టర్లను డీఎంసీ సభ్యులుగా నియమిస్తూ మార్చి 13న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
 
  ఈ జాబితాలో అంతకు ముందు నామినేట్ అయిన నలుగురి పేర్లు లేవు. దీంతో వారిలో ఇద్దరు ఈ నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిని  జస్టిస్ రాజీవ్ విచారించారు. ‘ఒకసారి కౌన్సిల్‌కి నామినేట్, ఎన్నికైన సభ్యులను ఈ విధంగా తొలగించడానికి వీలు లేదు. కౌన్సిల్ సభ్యునిగా ఉండటానికి అతను అనర్హుడు అయితేనే తొలగించాల్సి ఉంటుంది’ అని వినయ్ అగర్వాల్ తరఫు న్యాయవాది సందీప్ సేతి కోర్టులో వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ అంశాన్ని విచారించాల్సిన అవసరముందని చెప్పారు. తదుపరి విచారణ వరకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement