భారత సముద్రంలో గస్తీకి ఐసీజీఎస్ రాజ్‌ధ్వాజ్ నౌక సిద్ధం అయింది. బుధవారం ఈ నౌకను కోస్ట్ గార్డుకు అప్పగించారు. చెన్నై హార్బర్‌లోని గస్తీ సేవలకు రాజ్ ధ్వాజ్‌ను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జికే వాసన్ జెండా ఊపి సాగనంపారు.
భారత సముద్రంలో గస్తీకి ఐసీజీఎస్ రాజ్‌ధ్వాజ్ నౌక సిద్ధం అయింది. బుధవారం ఈ నౌకను కోస్ట్ గార్డుకు అప్పగించారు. చెన్నై హార్బర్‌లోని గస్తీ సేవలకు రాజ్ ధ్వాజ్‌ను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జికే వాసన్ జెండా ఊపి సాగనంపారు.
సాక్షి, చెన్నై: సముద్ర మార్గం ద్వారా సంఘ విద్రోహ శక్తులు భారత్‌లోకి చొరబడుతున్నట్టు ఇటీవలి ముంబై ఘటన ద్వారా తేలింది. దీంతో సముద్ర తీరాల్లో గస్తీని పెంచారు. భారత నావికాదళం, భారత కోస్ట్ గార్డ్, సముద్ర తీర భద్రతా విభాగం, రాష్ట్ర మెరైన్ పోలీసుల నేతృత్వంలో సముద్ర తీరాల్లో నిఘాను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు అత్యాధునిక నౌకల్ని సైతం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్‌కు సేవలందించేందుకు అత్యాధునిక ఆయుధాలు, వసతులతో కూడిన ఐసీజీఎస్‌కు చెందిన రాజ్ ధ్వాజ్ నౌక సిద్ధం అయింది. కోల్‌కతాలో రూపుదిద్దుకున్న రాజ్ ధ్వాజ్‌ను చెన్నై హార్బర్‌కు తీసుకొచ్చారు. 31.5 నాటికన్ మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ నౌకలో అత్యాధునిక తుపాకులు, ఆయుధాలతో కూడిన మోటార్ బోట్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఐదుగురు ఉన్నతాధికారులతో పాటుగా 30 మంది కోస్ట్ గార్డ్ కమాండోలు విధుల్లో ఉంటారు. అంకితం: కోస్టు గార్డు గస్తీ సేవలకు ఈ నౌక బుధవారం అంకితం అయింది. చెన్నై హార్బర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర నౌకాయన శాఖ మంత్రి జికే వాసన్ ఈ నౌకను జెండా ఊపి సాగనంపారు.
ముందుగా ఆ నౌకలోని అత్యాధునిక ఆయుధాలు, ఏర్పాట్లను వాసన్ పరిశీలించారు. కోస్టుగార్డు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో వాసన్ మాట్లాడుతూ, భారత సముద్ర తీరాల్లో గస్తీని ముమ్మరం చేశారు. అత్యాధునిక ఆయుధాలు రాజ్ ధ్వాజ్‌లో ఉన్నాయని వివరించారు. సరిహద్దుల్లోకి చొరబడే అనుమానాస్పద బోట్లను, సంఘ విద్రోహ శక్తుల కదలికల్ని పసిగట్టేందుకు ఇందులో అత్యాధునిక ఏర్పాట్లు ఉన్నాయన్నారు. చెన్నైలోని లైట్ హౌస్ వీక్షణకు సందర్శకుల తాకిడి పెరిగిందన్నారు. ఈ దృష్ట్యా, సమయాన్ని పెంచుతున్నామన్నారు. ఈనెల 20 నుంచి ఉదయం 9.30- సాయంత్రం 5.30 వరకు సందర్శకుల సమయంగా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో భారత కోస్ట్ గార్డ్ డెరైక్టర్ జనరల్ అడ్మిరల్ అనురాగ్ జీ తాప్లియల్, రీజనల్ కమాండర్ ఎస్‌పి శర్మ తదితరులు పాల్గొన్నారు.