వినూత్న పంథా.. | Innovative approach .. | Sakshi
Sakshi News home page

వినూత్న పంథా..

Published Thu, Sep 11 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

Innovative approach ..

  • గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు
  •  నూతన మార్గాలను అవలంభించనున్న ప్రభుత్వం
  • సాక్షి, బెంగళూరు :  వైద్యశాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అడుగేస్తోంది. ఇందుకు వినూత్న పంథాను ఎంచుకుంది. ప్రైవేట్‌తో పాటు స్వచ్ఛంద సంస్థ సహకారంతో పథకాన్ని విజయవంతంగా నడిపేందుకు వ్యూహరచన చేసింది. రాబోవు ఏడాది నుంచి వైద్య విద్య పూర్తి చేసుకున్నవారు ఏడాది పాటు గ్రామ సేవ కచ్చితంగా చేయాలన్న నిబంధన అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకు వెళుతోంది.

    అనుకున్న వనరులు సమకూరితే మరో రెండు నెలల్లో నూతన పంథా ద్వారా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదనే విమర్శ చాలా కాలంగా ప్రభుత్వాన్ని వేధిస్తోంది. నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు మౌలిక వసతుల కొరత కూడా ఇందుకు కారణమవుతూ వచ్చింది. దీంతో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన మార్గాన్ని అనుసరించాలని భావిస్తోంది.

    రాష్ట్రంలోని 176 తాలూకా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వారంలో ఒక రోజు ఓ నిపుణుడైన వైద్యుడు తప్పనిసరిగా ఉండేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ కంపెనీల సహకారం తీసుకోనుంది. నూతన కంపెనీ చట్టం ప్రకారం లాభాల్లో రెండు శాతాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా కంపెనీలు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లోకి నిపుణులైన వైద్యులను తీసుకెళ్లేందుకు వెచ్చించేలా ఆయా కంపెనీలకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.
     
    సత్పలితాలనిస్తున్న ‘స్పర్శ’
     
    కుష్టువ్యాధిని నిర్మూలించే చర్యల్లో భాగంగా పెలైట్ ప్రతిపాదికన రాష్ట్రంలోని కొన్ని తాలూకా కేంద్రాల్లో ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ డెర్మటాలజిస్ట్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడంతో పాటు పూర్తి అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వ పరంగా అందే సాయంపై కూడా అవగాహన కల్పిస్తోంది.

    మరోవైపు ప్రత్యేకంగా వ్యాధి నిర్మూల కోసం కృషి చేస్తూ, బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలను రోగులకు తెలియజేస్తోంది. ‘స్పర్శ’ పేరుతో పెలైట్‌ప్రతిపాదికన అమలవుతున్న ఈ కార్యక్రమంలో కేవలం కుష్టుకే కాకుండా చర్మ సంబంధ వ్యాధులన్నింటిని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ‘స్పర్శ’ కోసం స్వచ్ఛంద సంస్థల సహకారం మాత్రమే ప్రభుత్వం తీసుకుంటోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement