టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కళా ఇలాకాలో గ్రూపు తగాదాలు
ప్రత్యర్థి వర్గానికి మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్ వత్తాసు?
పథకాల పంపిణీ నుంచి బదిలీల వరకూ ఒత్తిళ్లు
తారస్థాయికి వర్గపోరు... నలిగిపోతున్న ప్రజలు
కిమిడి కళావెంకటరావు... అధికార టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు! దసరాకు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకు కచ్చితంగా ప్రాధాన్యం ఉన్న బెర్త్ దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది! కానీ సొంత నియోజకవర్గమైన ఎచ్చెర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య గ్రూపు తగాదాలను చక్కదిద్దట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ తమ్ముళ్ల వీరంగం తారస్థాయికి చేరడం ఆ వాదనకు ఊతమిస్తోంది.
సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక నుంచి అధికారుల బదిలీల వరకూ తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడం కళ్లకు కడుతోంది. చివరకు ఇటీవల రణస్థలంలో ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలనూ వివాదాస్పదం చేసేశారు. కళా ప్రత్యర్థి వర్గానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి బాబ్జీ దంపతులు వత్తాసు పలుకుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకుల ఆధిపత్య గొడవల్లో తాము నలిగిపోతున్నామని అధికారులు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
శ్రీకాకుళం: నియోజకవర్గంలోని ప్రధానమైన ఎచ్చెర్ల మండలంలో కళా వర్గంతో పాటు కళా వర్గీయుల విధానం నచ్చని కొంతమంది టీడీపీ నాయకులు వేరే వర్గంగా కొనసాగుతున్నారు. వారికి జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి దంపతులు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ నడుస్తోంది. నీరు-చెట్టు పథకం ఇతరత్రా పనుల కోసం కళాను ఆశ్రయించడానికి ఆయన వర్గం నాయకులే అడ్డుపడితే చేసిది లేక కొంతమంది తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను ఆశ్రయిస్తున్నారు. అటు కళాను, ఇటు కూన రవిని కలవడానికి ఇష్టంలేని వర్గమంతా చౌదరి బాబ్జీ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి పనులు చేయించుకుంటున్నారు.
ప్రభుత్వ పనుల పంపకంలో వివాదాలు తలెత్తుతున్నా రెండు వర్గాలు చివరకు అలా పరిష్కరించుకుంటున్నాయి. అయితే పార్టీలోకి చేర్పుల విషయంలో మాత్రం రచ్చవుతోంది. ఈ విషయంలో కళా వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తుండంతో మండల, గ్రామాల స్థాయిల్లోని వారి వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అజ్జరాం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం వర్గ విభేదాలకు ఆజ్యం పోసింది.
అలాగే కొయ్యాం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని పార్టీలో చేర్పించేందుకు చౌదరి వర్గం చేస్తున్న ప్రయత్నాలకు కళా వర్గం మోకాలొడ్డుతోంది. ఇదిలాఉంటే రోడ్డు మంజూరు చేయకపోతే తమ గ్రామంలో అడుగుపెట్టనివ్వబోమని కళా వర్గానికి చెందిన కొత్తపేట గ్రామ నాయకులు ఏకంగా జెడ్పీ చైర్‌పర్సన్‌కే హెచ్చరికలు జారీ చేశారు.
రణస్థలంలో రణరంగమే
తెలుగు తమ్ముళ్లు రణస్థలం మండలంలో ఏకంగా నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎంపీపీ గొర్లె విజయకుమార్, బంటుపల్లి పంచాయతీకి చెందిన ఎన్.ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్), పార్టీ మండల అధ్యక్షుడు సత్యేంద్రవర్మరాజు, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు ఆయా వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు.
నీరు-చెట్టు పథకం పనులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు, పాఠశాల యాజమాన్య సంఘాల ఎన్నికలు... ఇలా ప్రతి పనిలోనూ తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు యథాశక్తి పోటీపడుతున్నారు. ఈ పోటీ చివరకు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకునే వరకూ వెళ్తోంది. అంతేకాదు పథకాల అమల్లో జాప్యం ఒక్కటే కాదు ప్రజలను చాలా ఇబ్బందులకూ గుర్తిచేస్తోంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతోందోనని అధికారులూ తలపట్టుకుంటున్నారు.
లావేరులో ఆధిపత్య పోరు
లావేరు మండలం టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ హవాకు అడ్డుకట్ట వేయడానికి పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏ పని చేయాలన్నా తన అనుమతి లేకుండా చేయవద్దని సురేష్ అధికారులకు చెబుతుండటమే దీనికి కారణం. లింగాలవలస, వెంకటాపురం, బెజ్జిపురం, పెదరావుపల్లి, బుడతవలస పంచాయతీలకు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడి సురేష్‌కు చెక్ పెట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రణస్థలం మండలానికి చెందిన ఎన్.ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) మద్దతు కూడా లభించడంతో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. గతంలో ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన పి.వేణుగోపాలరావును సురేష్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే బదిలీ చేయించారనే చర్చలూ జరిగాయి.
జి.సిగడాంలోనూ బాహాబాహీ
త్వరలో ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉన్న జి.సిగడాం మండలంలోనూ టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారు. కాంట్రాక్టు పనుల విషయంలో వాటాలు కుదరక ఇటీవల జాడ గ్రామంలో చోటుచేసుకున్న తగాదాలే దీనికి నిదర్శనం. ఈ మండలంలో ప్రధానంగా టీడీ వలస, మెట్టవలస, పెంట, డీఆర్ వలస గ్రామాల్లో వర్గపోరు ఎక్కువగా ఉంది. కళా వర్గీయుల వ్యతిరేక వర్గమంతా తమ పనుల కోసం ప్రభుత్వ విప్ రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, బాబ్జీలను ఆశ్రయించడం బహిరంగ రహస్యమే!
ఎచ్చెర్లలో పచ్చతమ్ముళ్ల రచ్చ!
Published Sat, Oct 1 2016 12:12 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
Advertisement
Advertisement