నా మాటే శాసనం అంటున్న ఎంపీ
ప్రతి పనిలో వాటా ఇవ్వాల్సిందేనని పట్టు
అంత సీన్ లేదంటున్న ఎమ్మెల్యేలు
చినబాబు అండతోనే ఎంపీ రెచ్చిపోతున్నారని విమర్శలు
నాయకుల మధ్య పెరుగుతున్న అంతరం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రజాప్రతినిధికి, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల ముందు అతి వినయం ప్రదర్శించి, నాయకులను, కార్యకర్తలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని.. ఎన్నికల్లో గెలుపొందాక ఆయన నిజస్వరూపం బయట పడుతోందని.. సొంత పార్టీ నాయకులకే చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోందని వినికిడి. ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన నాయకులను సైతం పార్టీ ఆఫీసుకు వెళ్తే ఎందుకు వస్తున్నారని అక్కడి సిబ్బంది ముఖం మీదే అడుగుతుండటంతో.. ఇంతలోనే ఎంత తేడా అని వారు నిట్టూరుస్తున్నారు.
⇒ మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నేతలకు కాసులు కురిపించే కల్ప వృక్షం. ఎన్నికల ముందు వరకు ఎంపీ, ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా సఖ్యతగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తీరా ఎన్నికలయ్యాక వాటాల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ తనకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీటీపీఎస్‌లో బూడిదపై ఇద్దరి మధ్య షేర్ కుదిరినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఎన్నికల సమయంలో ఖర్చంతా నేనే పెట్టుకున్నానని. నీకేం సంబంధం. మిగతా వాటిలో మీకు వాటా ఇవ్వలేను. నా నియోజకవర్గ సరిహద్దులోకి రావద్దు’ అని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పడంతో వారి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది.
⇒ నందిగామ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరువురు నేతలు పైకి బాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ రోజురోజుకు అంతరం పెరుగుతోందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచ్‌లను ఎంపీ తన కంట్రోల్‌లో ఉంచుకొని, పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చివరకు రైతుబజార్లలో కూరగాయల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి వచ్చే మామూళ్లలో సైతం ఇద్దరికీ తేడాలు వచ్చినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.
⇒ తిరువూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉప్పు, నిప్పు మాదిరి ఉన్నారు. అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, మద్యం, పేకాట వంటి మామూళ్లకు సంబంధించిన విషయాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే తనను కేర్ చేయకపోవడంతో, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీనే ఓ వర్గాన్ని రెచ్చగొట్టి, నియోజకవర్గ పెద్దలకు స్థానిక నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు, అక్కడ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
⇒ జగ్గయ్యపేటలో పాగా వేసేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇసుక క్వారీల విషయంలో కొన్నింటిని తన వాటాగా తీసుకున్నారు. అక్కడ పరిశ్రమలు ఉండటంతో, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు ఎంపీ ప్రయతి్నస్తుండటంతో వారి మధ్య వివాదం చెలరేగుతోంది.
⇒ విజయవాడలోని ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాము సీనియర్లం అనే భావనలో ఎమ్మెల్యేలు ఉంటే, తన పెత్తనం సాగాల్సిందేనని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారు.
చినబాబు అండతోనేనా?
ఎన్నికల ముందు వరకు ఎంపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలందరికీ ఆయన చుక్కలు చూపిస్తుండటంతో లోలోన వారి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో ఎంపీ జోక్యాన్ని వారు సహించలేకపోతున్నారు. కొంత మంది టీడీపీ నేతలైతే చినబాబు అండతోనే ఎంపీ తన ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment