
అంతర్గత సమరం!
డీఎంకేలో అంతర్గత సమరం రాజుకుంటోం ది. ఓ వైపు పార్టీ బలోపేతం కోసం కరుణ ప్రయత్నాల్లో ఉంటే, మరో వైపు పార్టీ వర్గాలు లేఖాస్త్రాలతో రచ్చకెక్కుతుండడంతో అన్నా
సాక్షి, చెన్నై: డీఎంకేలో అంతర్గత సమరం రాజుకుంటోం ది. ఓ వైపు పార్టీ బలోపేతం కోసం కరుణ ప్రయత్నాల్లో ఉంటే, మరో వైపు పార్టీ వర్గాలు లేఖాస్త్రాలతో రచ్చకెక్కుతుండడంతో అన్నా అరివాలయం వర్గాల్ని కలవరంలో పడేస్తున్నాయి. ఈ కొత్త సమస్యతో కరుణానిధికి శిరోభారం తప్పడం లేదు. డీఎంకేలో ప్రక్షాళన పర్వం వేగం పుంజుకున్న సమయంలో సీఎం అభ్యర్థిత్వ నినాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్టాలిన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కల్యాణ సుందరం లేఖాస్త్రం సంధించి చర్చకు తెర లేపారు. దీంతో పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి కల్యాణ సుందరానికి తాత్కాలిక బహిష్కరణ తప్పలేదు. ఈ లేఖతో స్టాలిన్‌కు మద్దతుగా నినాదం ఊపందుకోవడంతో దీనికి ముగింపు పలికేందుకు కరుణానిధి తీవ్ర కసరత్తుల్లో పడ్డారు. ఈ పరిస్థితుల్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా మరో లేఖాస్త్రం అన్నా అరివాలయం చేరడంతో డీఎంకేలో అంతర్గత సమరం రాజుకుంటోందని స్పష్టం అవుతోంది.
మరో లేఖాస్త్రం: స్టాలిన్ సీఎం అభ్యర్థిత్వానికి మద్దతుగా గళం పెరుగుతున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా మరో లేఖ బయలుదేరడంతో డీఎంకేలో చర్చ రాజుకుంటోంది. సేలం జిల్లా ఆత్తూరు పరిధికి చెందిన నాయకుడు వడివేల్ పేరిట ఈ లేఖ అన్నా అరివాలయం చేరింది. ఈ లేఖను రహస్యంగా ఉంచినా, ఎట్టకేలకు మీడియా దృష్టికి చేరడంతో డీఎంకేలో చర్చ మొదలైంది. స్టాలిన్‌ను 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు పక్కన పెట్టాలని, ఆయన కారణంగానే పార్టీ అధోగతి పాలవుతోందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, పార్టీకి సీనియర్లుగా ఉన్న నేతల్ని బహిష్కరిస్తున్నారని, ప్రక్షాళన పేరుతో నాయకులను పక్కన పెడుతూ వస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం తప్పదంటూ ఆ లేఖలో హెచ్చరించి ఉండటం గమనార్హం.
అయితే, వడివేల్ మాత్రం ఆ లేఖను తాను రాయలేదని స్పష్టం చేస్తున్నారు. తాను స్టాలిన్‌కు విధేయుడిని అని, అలాంటప్పుడు తాను ఆయనకు వ్యతిరేకంగా ఎలా లేఖ రాయగలని పేర్కొన్నారు. తన పేరిట ఎవరో పనిగట్టుకుని లేఖ రాసినట్టుందంటూ వడి వేల్ పేర్కొనడం బట్టి చూస్తే, స్టాలిన్‌కు వ్యతిరేకంగా సేలం నుంచి మరో గ్రూపు బయలు దేరుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ లేఖాస్త్రాలు పార్టీని రచ్చకెక్కిస్తుండడంతో కరుణానిధికి శిరోభారం తప్పడం లేదు. ఉన్న సమస్యలకు తోడుగా ఈ కొత్త సమస్య రావడంతో దీనికి ముగింపు ఇవ్వడం లక్ష్యంగా లేఖాస్త్రాల్ని సంధించే వారిని శాశ్వతంగా సాగనంపేందుకు ఆయన నిర్ణయించినట్టు సమాచారం.