
ఐటీ మరింత అభివృద్ధి చెందాలి
‘విజన్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్‌సెమీ కండక్టర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సోమవారమిక్కడ ఏర్పాటైన ‘విజన్ సమ్మిట్-2015’ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ లావాదేవీలు జరిపే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉందని అన్నారు. అంతేకాక ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో మూడో స్థానంలో ఉందని తెలిపారు.
దేశంలోని 819 పరిశోధనా కేంద్రాల్లో 400 కేంద్రాలు కర్ణాటకలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 200 ఇంజనీరింగ్ కాలే జీలున్నాయని, ఏడాదికి దాదాపు లక్ష మంది ఇంజనీర్‌లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి ఒక్క వ్యాపారవేత్త ముందుకు రావాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.రాధాకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ పాల్గొన్నారు.