
రోశయ్యకు కలిసొచ్చేనా !
సీఎం జయ సిఫార్సుగా ప్రచారం
చెన్నై: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనేది సామెత. ఇందుకు భిన్నంగా కొత్త గవర్నర్‌గా శంకరమూర్తి నియామకం విషయంలో కావేరీ చిక్కులు ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్యకు కలిసొచ్చేనా? ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న చర్చ ఇదే. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని విశ్లేషకుల వాదన. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31వ తేదీన బాధ్యతలు చేపట్టారు.
ఆయన ఐదేళ్ల పదవీకాలం ముగిసేందుకు మరో రెండువారాలు మాత్రమే ఉంది. కేంద్రంలో ప్రభుత్వం మారినపుడు సహజంగా గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లను బదిలీ చేయడమో లేక ఇంటికి పంపడమే సహజంగా జరుగుతుంది. రెండేళ్ల క్రితం కేంద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనించి అనేక రాష్ట్రాల గవర్నర్లను ఎడాపెడా మార్చివేసింది.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతో నియమితులైన కాంగ్రెస్ కురువృద్ధుడు కె.రోశయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాదాలకు అతీతమైన వ్యక్తిగా, ప్రతిపక్ష పార్టీలు సైతం గౌరవించే నేతగా పేరొందిన రోశయ్య తమిళనాడులో సైతం అదే కీర్తిని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్య మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కొనసాగింది. దీనికి తోడు ప్రధాని మోదీకి, సీఎం జయలలితకు మధ్య పార్టీలకు అతీతంగా నెలకొని ఉన్న సత్ససంబంధాలు రోశయ్యను మరో మూడేళ్లపాటూ కొనసాగేలా చేశాయి. ఈ నెలాఖరుతో పరోక్షంగా సాగిన పొడిగింపు కాలం ముగియబోతోంది.
శంకరమూర్తితో సంకటం
రాజకీయ పునరావాసం వంటి రాష్ట్ర గవర్నర్ల పోస్టుల కోసం బీజేపీలోని ఎందరో పెద్దలు ఢిల్లీలో క్యూ కట్టుకుని ఉన్నారు. అధికారంలోకి వచ్చి మూడో ఏడు గడుస్తున్న తరుణంలో వారిలో కొందరినైనా సంతృప్తిపరచాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పై ఉంది.
ఈ తరుణంలో ఖాళీ కాబోతున్న తమిళనాడు గవర్నర్ స్థానంపై బీజేపీ కన్నుపడింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నేత, శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి పేరు రాబోయే తమిళనాడు గవర్నర్‌గా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆయన పేరును ఖరారు చేసినట్లు అనధికారికంగా వెల్లడైంది. అయితే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల సమస్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా నెలకొని ఉంది. దశాబ్దాల తరబడి నలుగుతున్న కావేరీ వాటా జలాల సమస్య రానురానూ జఠిలంగా మారుతోంది.
ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తే రాష్ట్రం మూడు పోరాటాలు, ఆరు ఆందోళనలుగా మారుతుందోననే భయం కేంద్రంలో నెలకొని ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై సీఎం జయలలిత సైతం శంకరమూర్తి నియామకాన్ని విబేధిస్తున్నట్లు తెలుస్తోంది. కొరివితో తలగోక్కున్నట్లుగా మారే శంకరమూర్తిని తెచ్చుకునేకంటే ఐదేళ్లుగా అలవాటుపడిన రోశయ్యను కొనసాగించాల్సిందిగా సీఎం జయ కేంద్రాన్ని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోశయ్య పదవీకాలం పొడిగింపు అవకాశమే లేదని రాష్ట్ర బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. అలాగే కావేరీ జలాల వివాదం నేపథ్యంలో శంకరమూర్తి నియామకంపై కేంద్రం వెనక్కు తగ్గినట్లు స్పష్టం చేశాయి. ఏదేమైనా పొడిగింపా, కొత్త నియామకమా అనే స్పష్టత కోసం మరో రెండువారాలు ఆగాల్సిందే.