
కర్ణాటకకు రమ్య గుడ్ బై?
శాండల్‌వుడ్‌లో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రముఖ తారగా వెలుగొందిన నటి రమ్య రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోనున్నారనేప్రచారం ప్రస్తుతం కన్నడ సినీపరిశ్రమలో సాగుతోంది.
- లండన్‌లో స్థిరపడేందుకు సన్నాహాలు!
సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్‌లో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రముఖ తారగా వెలుగొందిన నటి రమ్య రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోనున్నారనేప్రచారం ప్రస్తుతం కన్నడ సినీపరిశ్రమలో సాగుతోంది. శాండల్‌వుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రమ్య ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే రాజకీయాల్లో ఆమె అనుకున్నంతగా రాణించలేక పోయారు. 2013లో మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన రమ్య, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు.
ఇక ఇప్పుడు ఆమె బెంగళూరు నగరాన్ని వీడి లండన్‌లో స్థిరపడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే వార్తలు గాంధీనగర్‌లో వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా ఆమె బయటి ప్రపంచానికి కనిపించకపోవడం, తన సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లను కూడా డిస్‌కనెక్ట్ చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. కాగా రెండు నెలలుగా రమ్య లండన్‌లోనే ఉండడంతో ఆమె ఇక అక్కడే స్థిరపడనున్నారని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.
తన తల్లితో కలిసి లండన్ వెళ్లిపోయేందుకు ఇప్పటికే రమ్య అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నారని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే రమ్య దిల్ కా రాజా అనే కన్నడ సినిమాతో పాటు కాదల్ టు కళ్యాణం అనే తమిళ సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. దీంతో ఈ సినిమాల్లో అసలు రమ్య నటించనున్నారా.. లేదా అంతకుముందే ఉద్యాన నగరి వీడి లండన్ వెళ్లిపోతారా.. అన్న విషయంపై అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.