ఈ ఏడాది వీరిది! | this year we are full enjoy moments... | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వీరిది!

Published Sun, Dec 28 2014 5:59 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

ఈ ఏడాది వీరిది! - Sakshi

ఈ ఏడాది వీరిది!

ఇది ఎప్పుడూ ఉండేదే అయినా, మళ్లీ మళ్లీ ఉత్సాహాన్నిచ్చేది కూడా! కొన్ని తలపోతల్ని తవ్వుకోవడం, వచ్చిన దారిని వెనుదిరిగి చూసుకోవడం! తెలుగువారి చరిత్రకు సంబంధించీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన మైలురాయి. మనం రెండు రాష్ట్రాలుగా ‘కలిసిపోయాం’! ఘటనాఘటనల్ని అటుంచితే, ఈ సంవత్సరాన్ని తమదిగా చేసుకున్న వ్యక్తులు వీళ్లు. కొన్నిసార్లు ప్రగతి వ్యక్తిగతమైనదే అయినా అది నేలంతటికీ వర్తిస్తుంది. అందుకే ఈ ‘2014లో విస్మరించలేని వ్యక్తుల’ జాబితా! అయితే, కైలాశ్ సత్యార్థి లాంటివాళ్లు ఈ ఏడాది నోబెల్ శాంతిబహుమతి గెలుచుకున్నప్పటికీ ఈ జాబితాలో చేర్చలేదు. కేవలం తెలుగువాళ్లకే పరిమితమయ్యాం. అలాగే వీళ్లను ప్రజెంట్ చేయడంలో ప్రాధాన్యాల క్రమం పాటించలేదు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే, ఇది పరమప్రమాణం కాదు, సాధికారికం కూడా కాదు. ఈ జాబితాలోని లోటుపాట్లని మానవ పరిమితిగా పరిగణించండి.
 
సత్య నాదెళ్ల
సాఫ్ట్‌వేర్ దిగ్గజం

అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడు దశాబ్దాల పైగా చరిత్రలో ముచ్చటగా మూడో సీఈవోగా పగ్గాలు చేపట్టి సంచలనం సృష్టించాడు సత్య నాదెళ్ల. అనంతపురం జిల్లా బుక్కాపురం నుంచి మొదలైన సత్యనారాయణ నాదెళ్ల ప్రస్థానం... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీదుగా మైక్రోసాఫ్ట్ దాకా సాగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన సత్య 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి, అంచెలంచెలుగా సీఈవో స్థాయికి ఎదిగాడు. ఏడాదికి రూ. 520 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్న నాదెళ్ల... ప్రపంచవ్యాప్తంగా 50 మంది అత్యుత్తమ సీఈవోలతో ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 38వ స్థానం దక్కించుకున్నాడు. ‘క్లౌడ్’ లాంటి కొంగొత్త విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌కి  పూర్వ వైభవం తెచ్చిపెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నాడు.
 
సానియా మీర్జా
టెన్నిస్ అంబాసిడర్

ఒకానొకదశలో టెన్నిస్‌కు వీడ్కోలు చెబుదామని భావించిన సానియా మీర్జా ఈ యేడు నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా... సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ సాధించింది. అంతేకాకుండా కారా బ్లాక్ (జింబాబ్వే)తో మూడు టైటిల్స్ నెగ్గడంతోపాటు, మరో నాలుగు టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్’లో విజేతగా నిలువడం ద్వారా గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ‘బ్రాండ్ అంబాసిడర్’గా నియామకం తర్వాత సానియా ఆట ఉన్నత శిఖరానికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించడం, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించడం, ఐక్యరాజ్యసమితి (యూఎన్) దక్షిణాసియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియామకం... ఇలా ఈ ఏడాది సానియాకు పూర్వ వైభవాన్ని రప్పించింది.
 
కొలకలూరి ఇనాక్
సముచిత గౌరవం

ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ రంగానికి చేసిన సేవలకుగానూ భారతప్రభుత్వం ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గుంటూరు జిల్లా వేజండ్లలో జన్మించిన ఇనాక్ సాహిత్యంలో, దళిత స్పృహ, స్త్రీవాద చైతన్యం, విప్లవభావాలు అన్నీ ఉంటాయి. అయినా ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడు కాడు. ఆయన నేలలో వేరూనిన చెట్టు! గ్రామీణ జీవితంలోని సాంఘిక వివక్షతలను వివిధ ప్రక్రియల్లో ప్రశ్నించారు. ఇనాక్ కథలు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇనాక్ కథలను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించిన సాహిత్య అకాడెమీ ఆయన రచనలను ‘ఆధునిక సాహిత్యంలో క్లాసిక్స్’గా అభివర్ణించింది. ఇనాక్ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
 
కె.చంద్రశేఖరరావు
‘ప్రత్యేక’ సాధకుడు

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయంగా కూడా సత్తా చాటారు. జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ ఆ లక్ష్య సాధనలో విజయవంతం కావడం, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ద్వారా కేసీఆర్  డబుల్ సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక తెలంగాణ సాధన అంశాలు ఈసారి సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేశాయి. అయితే తెలంగాణ వచ్చింది మా వల్లనే, ప్రత్యేక తెలంగాణ మా అధినేత్రి చలువే... అంటూ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌కు కాలం కలిసిరాలేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు కూడా తెలంగాణలో వర్కవుట్ కాలేదు. కేసీఆర్ నేతృత్వంలోని గులాబీదళమే సంపూర్ణ ఆధిక్యత సాధించింది.
 
పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి
ఫోర్బ్స్ ఎంట్రీ

ఫార్మా దిగ్గజం, అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ఆయన సంపదను 1.8 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. కంపెనీ షేరు ధర ఏకంగా మూడు రెట్లు పెరగడం ఇందుకు కారణం. తయారీ ప్రక్రియల్లో లోపాల మూలంగా 2011లో విధించిన ఆంక్షలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా ఎత్తివేయడం ఇందుకు దోహదపడింది. అమెరికాలోనూ, యూరప్‌లోనూ కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కె.నిత్యానంద రెడ్డితో కలిసి రామ్‌ప్రసాద్ 1986లో అరబిందో ఫార్మాను ప్రారంభించాడు. కంపెనీ ప్రస్తుతం హృద్రోగం, మధుమేహం, హెచ్‌ఐవీ మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను 125 పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇటీవలే అమెరికాకు చెందిన న్యూట్రాస్యూటికల్ సంస్థ నాట్రోల్‌ను కొనుగోలు చేసింది.
 
రామ్‌గోపాల్‌వర్మ
నిరంతర వ్యాఖ్యా స్రవంతి

ఫ్లోకామ్ టెక్నాలజీతో కేవలం పాతిక వేల రూపాయలతో సినిమా తీయొచ్చని ‘ఐస్‌క్రీమ్’తో నిరూపించాడు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. సినిమా నిర్మాణంలో మూస విధానాలు ఉండకూడదని నిర్మొహమాటంగా వెల్లడించాడు. వైజాగ్‌లో కాదు... కరీంనగర్‌లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తానని నిర్భయంగా ప్రకటించాడు. కేసీఆర్, పవన్‌కల్యాణ్‌పై పాజిటివ్‌గానూ, నెగిటివ్‌గానే కాదు, చివరకు దేవుళ్ల మీద కూడా తనవైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు.
 
మహమ్మదాలీ బేగ్
థియేటర్ ఐకన్

నాటక రంగ సేవలకుగాను భారతప్రభుత్వం మహమ్మదాలీ బేగ్‌ను ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో గౌరవించింది. ఆయన తండ్రి ఖాదర్ అలీ బేగ్ నాటకాన్ని ముంబైలో చూసిన పృథ్వీరాజ్ కపూర్ ‘నీ చేతుల్లో నాటకరంగం భవిష్యత్తు పదిలంగా ఉంటుంది’ అన్నారు. దురదృష్ట వశాత్తూ ఖాదర్ అలీ బేగ్ 46 ఏళ్ల వయసులోనే మరణించాడు. తండ్రి అందించిన నాటకరంగపు కాగడాను కుమారుడు చేబూనాడు! తండ్రి పేరు మీద ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ స్థాపించి, ‘నాటకరంగ పునరుజ్జీవన వారసత్వాన్ని కొనసాగిస్తున్న అరుదైన నమూనా’గా ఫ్రాన్స్ దేశపు సమున్నత గౌరవం పొందాడు. నాటకరంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి కెనడా ప్రభుత్వం అందజేసే  అవార్డునూ టొరొంటోలో అందుకున్నాడు. ఈ సందర్భంగా స్వీయ దర్శకత్వంలో జీవితభాగస్వామి నూర్‌బేగ్‌తో కలసి నటించిన ‘కులీదిలోంకీ షాహ్‌జాదా’ను ప్రదర్శించాడు.
 
నారా చంద్రబాబు నాయుడు
మళ్లీ ముఖ్యమంత్రి

‘విభజనానంతర’ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండిన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విభజన తర్వాత నూతన రూపు రేఖలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, పవన్ కల్యాణ్ కలిసి రావడం తెలుగుదేశం పార్టీకి అనుకూలాంశాలుగా నిలిచాయి. రైతుల రుణమాఫీ హామీ కూడా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని గద్దెనెక్కించడంలో కీలకపాత్ర పోషించింది. 175 సీట్లలో 102 సీట్లు ఆ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి అదనంగా లభించింది ఐదు లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే అయినప్పటికీ దశాబ్దంగా అధికారంలో లేని పార్టీని విజయపుగట్టుకు చేర్చడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు.
 
డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి
ప్రజారోగ్యం... ఆయనకు భాగ్యం!

 దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థ ‘ఎయిమ్స్’లో కార్డియాలజీ విభాగపు అధిపతి లాంటి అసామాన్యమైన హోదాను కూడా వదులుకున్నారు శ్రీనాథ్‌రెడ్డి. ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య వసతులూ అందని అసౌకర్యాలను గుర్తించి, ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ప్రజారోగ్యం కోసం అవసరమైన నిపుణుల తయారీ, వాళ్లకు అవసరమైన శిక్షణ, అందుకోసం కావాల్సిన 80 సంస్థలను నెలకొల్పడం వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టారు. వాటికిగానూ భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్’ గౌరవం పొందిన ఈ వైద్యమణిని బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ‘రాయల్ ఆనర్’తో సత్కరించారు. హైదరాబాద్‌లో బాల్యాన్ని గడిపిన శ్రీనాథ్‌రెడ్డికి తండ్రి బోధించిన స్వామి వివేకానంద సూక్తులే స్ఫూర్తి!
 
నాగార్జున
‘మా’లో ఎవరు కోటీశ్వరుడు?

అమితాబ్ బచ్చన్‌కి చెల్లుబాటయినట్టుగా అందరికీ కాదు. వెండితెరపై సూపర్‌స్టార్‌గా రాణిస్తూ, బుల్లితెర మీదికి జంప్ చేయడమంటే ఓ మెట్టు దిగినట్టే! అమితాబ్ మాత్రం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో పదిమెట్లు పైకి ఎక్కి చూపించాడు. నాగార్జున కూడా సేమ్ టూ సేమ్. మరికొన్ని సినిమాలు చేస్తే, వంద సినిమాలు పూర్తి చేసుకొనే దశలో ఉన్న నాగ్ ‘మా’ టీవీ కోసం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేయడమంటే ఒక రకంగా రిస్కే. కానీ 2014లో నాగ్ అవలీలగా బుల్లితెరను ఆక్రమించాడు. ఇన్నేళ్లూ వెండితెరపై మన్మథుడిలా ప్రకాశించిన నాగ్, బుల్లితెరపై కొత్త గెటప్‌తో సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు.

సాకేత్ మైనేని
భవిష్యత్‌కు భరోసా

వైజాగ్‌కు చెందిన 27 ఏళ్ల సాకేత్‌కు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. భారత డేవిస్ కప్ జట్టులో స్థానం, ఏటీపీ చాలెంజర్ టోర్నీలో మూడు డబుల్స్ టైటిల్స్, రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్, ఆరు ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్స్, ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం, చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పుణే మరాఠాస్ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర... ఇలా సాకేత్ భారత టెన్నిస్ భవిష్యత్‌కు భరోసా కల్పించాడు.

6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న ఈ ఆజానుబాహుడు పదునైన సర్వీస్‌లకు పెట్టింది పేరు. ఆటలోనే కాదు చదువులోనూ సాకేత్ మేటి. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక అమెరికాలోని అలబామా యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ స్కాలర్‌షిప్ రావడంతో అక్కడకు వెళ్లాడు. చదువు పూర్తయ్యాక 2011లో భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఇండియన్ ఫ్యూచర్స్ టోర్నీలో సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు.
 
నలిమెల భాస్కర్
బహుభాషా అనువాదకుడు

కరీంనగర్ వాసి నలిమెల భాస్కర్ ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అవార్డు పొందారు. ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్‌అబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ను నలిమెల తెలుగులోకి ‘స్మారక శిలలు’గా అనువదించారు. ఈ పుస్తకమే అవార్డుకు ఎంపికైంది. గ్రంథాలయాలే తరగతి గదులుగా భాస్కర్ భారతీయ భాషల్లో పట్టు సంపాదించారు. తాను తెలుగులో స్వయంగా ‘మంద’ కథను రాసి మరో 13 భారతీయ భాషా కథలను మూలభాష నుంచి అనువాదం చేసి భారతీయ కథలుగా పాఠకులకు అందించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు బోధనా వృత్తిలో ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలంగాణ మాండలీకంపై ఇతోధిక కృషి చేస్తున్న నలిమెల భాస్కర్ నేషనల్ బుక్‌ట్రస్ట్ సలహామండలి సభ్యుడు.
 
మత్స సంతోషి
పేదరికాన్ని లిఫ్ట్ చేసింది

నేపథ్యం ఎలాంటిదైనా పట్టుదలతో కృషి చేస్తే విజయం వరిస్తుందని విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల  మహిళా వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి నిరూపించింది. అరకొర సౌకర్యాల నడుమ సాధన చేసిన సంతోషి ఈ ఏడాది స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఆమెకు కోచ్ చల్లా రాము మార్గదర్శకుడిగా నిలిచాడు.  ఆమె గెలిచింది పేదరికాన్ని కూడా.  ఎందుకంటే జూట్ మిల్లులో కార్మికుడైన సంతోషి తండ్రి తన సంపాదనలో ఎక్కువ భాగం తన కూతురు సాధనకే వినియోగించాడు. భారత్ తరఫున పలుమార్లు జూనియర్, యూత్ విభాగాల్లో ఆసియా, కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న సంతోషి పలు పతకాలు సాధించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం నెగ్గి భవిష్యత్‌పై మరిన్ని ఆశలు పెంచింది.  
 
శ్రీధర్ కోట
ఎగరడానికి కొత్త రెక్కలు

రైట్ బ్రదర్స్ విమానాన్ని ఆవిష్కరించి వందేళ్లు గడచిపోతున్నా, దాని మౌలిక డిజైన్‌లో వచ్చిన మార్పులు దాదాపు శూన్యం. అదే ఆకారం, అవే పొడవైన రెక్కలు! అవసరాన్నిబట్టి ఆకారాన్ని మార్చుకునే రెక్కల ఫ్లాప్స్ (రెక్కల వెనుక భాగంలో పైకి, కిందకూ కదులుతూ ఉండే నిర్మాణాలు) రూపొందించారు శ్రీధర్ కోట! వీటిని అమర్చుకుంటే, ఇంధన ఖర్చు 12 శాతం వరకూ, టేకాఫ్, ల్యాండింగ్‌ల సమయాల్లోని శబ్దం 40 శాతం వరకూ తగ్గుతాయి.  ‘అడాప్టివ్ కంప్లయింట్ ట్రెయిలింగ్ ఎడ్జ్’ పేరుతో శ్రీధర్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని అమెరికా వాయుసేన ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. మన బేగంపేట విమానాశ్రయం నుంచి పైకి ఎగిరే విమానాల్ని చూస్తూ... 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీధర్ ఆ తరువాత అమెరికాలో స్థిరపడ్డారు.
 
అందె శ్రీ
‘రాష్ట్ర’ గీత రచయిత

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ సంస్థలు, రాజకీయ పక్షాలు ఉద్యమించిన సందర్భంలో అంద్శై గీతం ‘జయజయహే తెలంగాణ’ సంకల్పశక్తిని ఇనుమడింపజేసింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ గీతం రాష్ట్రగీతంగా అధికార హోదా పొందింది. గీత కర్త అంద్శైవరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. ‘గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాన’ంటారు. సుమతీ శతకం, వేమన శతకాల్లా తెలంగాణ ప్రజలు పాడుకునే ‘వరకవుల’ పద్యాలు ఆయనను ప్రకృతి కవిని చేశాయి. అందె ఎల్లయ్య అనే పూర్వనామాన్ని శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ అంద్శై మార్చారు. ఆలమందలు కాస్తూ అపురూప వాక్కులమ్మను ఉపాసించిన అంద్శై జక్కిరెడ్డి మల్లారెడ్డి, మహ్మద్ మునీర్ సేట్ వంటి సహృదయులు ఆదరించారు.  తెలంగాణ రాష్ట్రగీతం గురించి చెబుతూ- మొలకెత్తగానే విత్తనం చనిపోతుంది, కొన్నేళ్లుగా ప్రజల నాల్కలపై నునుపు తేలిన ఆ పాట నాది కాదు వారిదే అంటారు. తనను కొడుకుగా పెంచి పెద్దచేసిన బిరుదురాజు రామకృష్ణ  ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేలకు జాతీయ గీతం’ అని అభినందించారు.
 
అలేఖ్య పుంజల
కూచిపూడి గౌరవం

పేరుకు తగ్గ శాస్త్రీయ నృత్యకారిణి పద్మశ్రీ అలేఖ్యా పుంజల. ఈ సంవత్సరం కోణార్క్ ఉత్సవంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే అపూర్వ గౌరవాన్ని పొందారు. (గురు గంగాధర్ ప్రధాన్ 1986లో కోణార్క్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ప్రపంచశ్రేణి నృత్యకారులు, గాత్ర-వాద్య సంగీతకారులు ఒరిస్సాలోని కోణార్క నాట్యమండపంలో పాల్గొనడం జీవన సాఫల్యంగా భావిస్తారు.) భరతనాట్యం-కూచిపూడి రెండు శాస్త్రీయ నృత్యాల్లోనూ నిపుణురాలైన అలేఖ్య తాను కూచిపూడి పక్షపాతిని అంటారు. అభినయానికి, భావవ్యక్తీకరణకు కూచిపూడిలో అదనపు ఆస్కారం ఉంటుందంటారు. పురావస్తుశాస్త్రం ఆధారంగా శిల్పాలలో నృత్యకళ అంశంపై పరిశోధన చేసిన అలేఖ్య తెలుగు విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలు, నాట్యవిభాగం అధిపతి. సంగీత-నాటక అకాడెమీ పురస్కార గ్రహీత. కాంటెపరరీ జర్మన్ డ్యాన్సర్- ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్’ల  అభినయపూర్వక ప్రదర్శన ‘యు అండ్ మి’ని  హైద్రాబాద్, జర్మనీలలో ప్రదర్శించారు.
 
వినోద్ చౌదరి రాపర్ల
ఇన్‌స్టలేషన్ ఆర్ట్ పరిచయ కర్త

ఒక అపురూపమైన చిత్రకళా ప్రదర్శనను చూడబోతున్నాం అనుకున్న కళాభిమానులు ఆ గదిలోకి వెళ్లి బిక్కమొగం వేశారు. కళ ఏమీ కనపడదే! కాని, ఆ గది వింతగా ఉంది. చిందరవందరగా ఉంది. గోనె సంచులు. దుమ్మెత్తి పోసుకునే దినపత్రికల క్లిప్పింగులు. ప్లాస్టిక్ కుర్చీలు. ఒక పాతకాలపు కుర్చీ. పైన నెమలి ఈకలు. సిల్క్ వస్త్రం. ఏమిటది? ‘ద గోల్డెన్ చైర్’ పేరుతో గుంటూరుకు చెందిన వినోద్ చౌదరి ఏర్పాటు చేసిన ఇన్‌స్టలేషన్ ఆర్ట్! ఒకానొక అంశాన్ని బలంగా చెప్పేందుకు త్రీడైమన్షన్స్ స్థలంలో అనేక వస్తువుల అమరికతో ఏర్పాటు చేసే వస్తు సముదాయమే ఈ కళ! మహాభారతం చరిత్ర కాదనీ, వర్తమానం కూడాననీ, భవిష్యత్తు బాగుండాలంటే కుర్చీపై కూర్చునేవారిని ఎంపిక చేసుకోవడంలో జాగరూకత పాటించాలనీ గోల్డెన్ చైర్ చెబుతుంది. తన లైఫ్ క్యాన్వాస్‌లో పెళ్లికి చోటులేదనీ, కళతోనే సహజీవనమనీ అంటాడు. చైన్నైలో సినిమాలకు ఆర్ట్ వర్క్ చేశాడు. ఇటీవలే తన చిత్రాలను ప్రదర్శిస్తోన్న అమెరికాలోని న్యూజెర్సీ మ్యూజియంను సంద ర్శించి వచ్చాడు.
 
సంపూర్ణేశ్‌బాబు
ఆల్మోస్ట్ స్టార్

ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ప్రచారంతో వెండితెరపై ఉవ్వెత్తున ఎగిసిన కెరటం సంపూర్ణేశ్‌బాబు. తెలుగు చిత్ర సీమలో పేరుకు పోయిన పలు విధానాలను, రొడ్డకొట్టుడు కథాంశాలను, మూస పాత్రలను పరిహసిస్తున్న రీతిలో దర్శకుడు స్టీవెన్ శంకర్ చేసిన ‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేశ్‌బాబు రాత్రికి రాత్రి దాదాపు ‘స్టార్’గా అవతరించాడు. చిత్రమైన మాటతీరు, నిర్లక్ష్యపు శారీరక భాషతో సంపూర్ణేశ్ బాక్సాఫీస్‌కి పనికొచ్చే మూలకంగా మారాడు. సంపూర్ణేశ్‌తో నటుడు మంచు విష్ణు ‘పోకిరి రిటర్న్స్’ నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.
 
మంజులతా కళానిధి
అన్నదాత సుఖీభవ!

ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అంటారు. అలా ఇంటిదగ్గర మొదలయ్యే దాతృత్వానికి కాస్తంత సోషల్ మీడియా గాలి కూడా తగిలిందంటే ఎనలేని గుర్తింపు వస్తుంది. ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సైట్ల ద్వారా సెలబ్రిటీల మధ్య ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ విజయవంతమైన విరాళ కార్యక్రమంగా నిలిస్తే, దాని స్ఫూర్తితో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన మంజులతా కళానిధి. ఒక బకెట్ పరిమాణంలోని బియ్యాన్ని అన్నార్థులకు అందజేస్తున్న ఫొటోను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసి, అందరూ అలాంటి దాన కార్యక్రమాన్ని చేపట్టాలని సవాలు విసిరారు ఆమె. వేల మంది మంజులత ఐడియాను అభినందిస్తూ లైక్ కొట్టగా, అనేక మంది బకెట్టుడు బియ్యాన్ని ఇవ్వడమో, ఆ పరిమాణపు బియ్యాన్ని వండివడ్డించడమో చేశారు.
 
ఎంవైఎస్ ప్రసాద్
మన శాస్త్రవేత్త

 చంద్రయాన్, మామ్, తాజాగా జీఎస్‌ఎల్వీ మార్క్-3... భారత అంతరిక్ష ప్రయోగాల వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంవైఎస్ ప్రసాద్! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో దాదాపు 37 ఏళ్ల అనుభవాన్ని గడించిన ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా (1974) అందుకున్నారు. ఆ తరువాత బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అంశంపై స్నాతకోత్తర విద్యనభ్యసించారు. భారత దేశం తొలిసారి విజయవంతంగా ప్రయోగించిన లాంచ్ వెహికల్ ఎస్‌ఎల్‌వీ 3 అభివృద్ధిలోనూ ప్రసాద్ పాలుపంచుకున్నారు. 2013 నుంచి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం డెరైక్టర్‌గా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
ఎస్ ఎస్ రాజమౌళి
త్వరలో విడుదల

వరుస విజయాల పరుసవేది అనిపించుకున్న రాజమౌళి ‘ఈగ’ సినిమా 2012 జూలై 6న విడుదలైంది. అప్పటి నుంచీ ఆయన ‘బాహుబలి’ అనే అతి పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ప్రచారార్భాటాలకు దూరంగా నిర్మాణం జరుగుతున్నా కూడా, ఈ సినిమాకు సంబంధించిన రకరకాల గాసిప్‌లతో ఈ దర్శకుడు ఏడాదంతా మీడియాలో మార్మోగుతూనే ఉన్నాడు. బడ్జెట్, గెటప్స్, కాస్టింగ్, గ్రాఫిక్స్... ఇలా 24 శాఖల పరంగానూ ‘బాహుబలి’ వార్తల్లో నిలవడానికి ఆయన ఇమేజే కారణం!
 
రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి
సాహిత్యానికి రాచమర్యాద

తెలుగు సాహిత్య లోకంలో నిబద్ధతగల విమర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రముఖ రచయిత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘మన నవలలు-మనకథానికలు’ పేరుతో చంద్రశేఖర్ రెడ్డి రచించిన విమర్శనా గ్రంథానికి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా సాహిత్యానికి విశేష సేవలు అందించిన 24 మంది ప్రముఖులకు ప్రతియేటా సాహిత్య అకాడమీ అవార్డులను ఇస్తుంది. చిత్తూరు జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన రాచపాలెం శ్రీ కృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర, యోగి వేమన విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం ఆయన సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు.
 
మాలావత్ పూర్ణ
సద్దనపల్లి ఆనంద్‌కుమార్
శిఖరమంత విజయం!

ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తై శిఖరం. మరి దాన్ని అధిరోహిస్తే ఆ శిఖరమంతటి పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. అలాంటి ఖ్యాతిని అతి చిన్న వయసులోనే సంపాదించుకొన్నారు మాలావత్ పూర్ణ (13), సద్దనపల్లి ఆనంద్‌కుమార్(18). పూర్ణ అయితే ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో అభ్యసిస్తున్న ఈ సాహస వీరులకు తెలుగుజాతి నీరాజనాలు పట్టింది. 29,035 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని ప్రతిష్టించిన వీళ్లను చూసి భారతజాతి మొత్తం గర్వించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్... ట్రైనర్ శేఖర్ మార్గదర్శకత్వంలో ఈ అరుదైన ఘనత సాధించారు. క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసం లాంటి పదాలు మాత్రమే పూర్ణ, ఆనంద్‌ల సాహసాన్ని అర్థంచేసుకోవడానికి సరిపోవేమో!
 
కిడాంబి శ్రీకాంత్
చైనా గడ్డపై తెలుగు బిడ్డ గర్జన

మెదడువాపు జ్వరంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి... నెమ్మదిగా కోలుకొని... నమ్మశక్యంకాని విజయంతో ‘తెలుగు రాకెట్’ పదునెంతో చూపించాడు కిడాంబి శ్రీకాంత్. 21 ఏళ్ల ఈ యువతార ఏమాత్రం అంచనాలు లేకుండా చైనా గడ్డపై చమక్కుమనిపించాడు. ‘బ్యాడ్మింటన్ సచిన్’లా పేరొందిన చైనా సూపర్‌స్టార్ లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి, బ్యాడ్మింటన్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాడు. 2007లో మొదలైన చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ హైదరాబాద్ యువకుడు దాన్ని నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
 
 (సాక్షి స్పోర్ట్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్స్, సినిమా, పొలిటికల్, హెల్త్, కల్చరల్ డెస్కుల సహకారంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement