పుణే: నగరంలో ఆటోరిక్షా, లోకల్ రైల్లో ప్రయాణించడం వల్ల సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తన పర్యటనలో ఆప్ కార్యకర్తలు శృతిమించి వ్యవహరించినట్టు మీడియానే పెద్దది చేసి చూపిందని గురువారం ఓ మరాఠీ ఛానల్‌కు తెలిపారు. ఈ డ్రామాకు అంతా పూర్తి బాధ్యత మీడియాదేనని అన్నారు. మా పార్టీ కార్యకర్తలు ఎలాంటి విధ్వంసం సృష్టించలేదని తెలిపారు. తన పర్యటనతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఆటోలో, రైలులో ప్రయాణించడం పబ్లిసిటీ కోసం కాదని, తానెప్పుడు ప్రజా రవాణా వ్యవస్థనే వినియోగిస్తానని స్పష్టం చేశారు.
బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీని హైలెట్ చేసేందుకు. ఆప్ పార్టీని బదనాం చేసేందుకు మీడియాకు డబ్బులు అందుతున్నాయని పునరుద్ఘాటించారు. సామాన్యులకు సేవ చేయాలన్న తలంపుతో ముందుకువస్తున్న ఆప్‌ను చిన్నచిన్న విషయాలు చూపి అపప్రతిష్ట చేసేలా వ్యవహరించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బుధవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముంబైలో ప్రారంభించిన కేజ్రీవాల్ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
నేనలా అనలేదు
దేశ ప్రధానిని ఎన్నుకునే సమయంలో అత్యంతక్లిస్టపరిస్థితి ఏర్పడితే, తప్పనిసరి పరిస్థితిలో నరేంద్ర మోడిని ప్రధానిగా ఎన్నుకుంటానని తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నారిమన్ పాయింట్‌లో ‘ఫండ్ మెనేజర్, స్టాక్ బ్రోకర్స్’తో జరిపిన చర్చల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీకి మద్ధతిస్తా..? లేదా మాయావతినా..? అని మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.
చంద్రపూర్ సభకు హాజరుకాని కేజ్రీవాల్
అనారోగ్యం వల్ల కేజ్రీవాల్ చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరగాల్సిన బహిరంగ సభకు హాజరుకాలేదు. దీంతో వందలాది మంది రైతులు నిరాశ చెందారు. వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన 15 ప్రశ్నలను కేజ్రీవాల్‌ను అడగాలనుకున్నామని విదర్భ జనాందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారి అన్నారు. అయితే సదరు ప్రశ్నలతో లేఖను నాగపూర్‌లోని ఆప్ కార్యాలయానికి పంపించామని తెలిపారు. అయితే ఆప్ నాయకులు అంజలి దమనియా, రాజు భిషే, విజయ్ పాండరే, ప్రతిభా షిండే ఆధ్వర్యంలో సభ జరిగింది. ఇదిలావుండగా శుక్రవారం ముందున్న షెడ్యూల్ ప్రకారం నాగపూర్‌లో పర్యటిస్తారని ఆప్ నాయకుడు ఒకరు తెలిపారు.
‘ఆమ్ ఆద్మీ’కి ఇబ్బంది కలగలేదు
Published Thu, Mar 13 2014 10:29 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement