పేదలపాలిట సంజీవని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి
Published Sat, Oct 19 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
న్యూఢిల్లీ: పేద, ధనిక అన్న తేడాలేమీ లేకుండా అనారోగ్య సమస్యలు అందరినీ వేధిస్తూనే ఉన్నాయి. కలుషితమైన వాతావరణం, రసాయనాలతో పండించిన పంటలు మానవుడి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఆర్థికంగా ఫరవాలేదనుకున్నవారు అవసరమైన వైద్యం చేయించుకొని ప్రాణాలను కాపాడుకుంటున్నారు. పూటగడవడమే కష్టంగా ఉన్నవారు మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందుతున్నా ఏవో చిన్నాచితకా రోగాలకు మాత్రమే. కిడ్నీ మార్పిడి వంటి పెద్ద సమస్యే ఎదురైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ఈ భారాన్ని మోయలేనివారు తనువు చాలించాల్సిందే. ఇలాంటి రోగులపట్ల సంజీవనిగా నిలుస్తోంది నగరంలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్.
లక్షల రూపాయలు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడిని కూడా ఉచితంగా చేస్తూ, రోగి కోలుకునే వరకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజే స్తోంది. ఇప్పటిదాకా ఇటువంటి సౌకర్యం ఈ ఆస్పత్రిలో ఉండేది కాదని, అక్టోబర్ 8న బీహార్‌కు చెందిన రామ్ ప్రవేశ్‌కు తొలిసారిగా కిడ్నీ మార్పిడి చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ తర్వాత తమలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రోగుల్లో కొందరిని ఎంపిక చేసి త్వరలో మరిన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తామని చెబుతున్నారు. ఈ విషయమై అవయవ మార్పిడి విభాగం ఇన్‌చార్జి డాక్టర్ విమల్ భండారీ మాట్లాడుతూ.. ‘బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన రామ్ ప్రవేశ్ కిడ్నీ పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే అతని సమస్య ఐదో స్టేజీలో ఉంది. ఇటువంటి సమయంలో కిడ్నీని మార్చడం మినహా మ రో మార్గంలేదు.
పవేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతోపాటు ఆయన భార్య కిడ్నీని దానం చేసేం దుకు సిద్ధంగా ఉండడంతో కిడ్నీని మార్చాలని నిర్ణయించాం. అయితే అటువంటి ఆపరేషన్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో గతంలో ఎప్పుడూ చేయలేదు. దీంతో అనుభవజ్ఞుల పర్యవేక్షణలో కిడ్నీని మార్చాలని నిర్ణయించాం. యూరాలజీ, నెఫ్రాలజీ, అనస్థీషియా విభాగాలకు చెందిన ఆరుగురు డాక్టర్లు, ఎయిమ్స్, బీఎల్‌కే ఆస్పత్రులకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఈ నెల 8న ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశాం. గతంలో కిడ్నీ మార్పిడి ప్రక్రియను దాదాపు ఆరు సంవత్సరాలపాటు చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం దక్కింది. మిగతా వారికి కూడా మూడేళ్లకుపైగానే అనుభవముంది. అయితే ఈ ఆపరేషన్ చేసేందుకు ఇద్దరు నెఫ్రాలజిస్టుల అవసరముందని గుర్తించి అనుభవజ్ఞుల సాయం తీసుకున్నామ’ని చెప్పారు.
యూరాలజీ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ అనుప్ కుమార్ మాట్లాడుతూ... ‘ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి అవసరమైన రోగులు దాదాపు 50 మంది వరకు ఉన్నారు. వారిలో అత్యవసర వైద్యం అవసరమైన ఐదుగురిని గుర్తించి రానున్న రోజుల్లో వారికి ఆపరేషన్ చేస్తామ’ని చెప్పారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ మాట్లాడుతూ... ‘కేవలం ఆపరేషన్ చేసి వదిలించుకోవడం కాకుం డా రోగి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజేస్తున్నాం. ప్రవేశ్‌కు దాదాపు నెలరోజులకు సరిపడా మందులను అందజేశాం. ఆర్థికంగా ఇది వారికి ఎంతో ఊరటను ఇచ్చే విషయమే. అయితే ఈ ఆపరేషన్‌కు అవసరమైన పూర్తి సదుపాయాలు మా ఆస్పత్రిలో లేనందున కొన్ని పరీక్షల కోసం ఎయిమ్స్, ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో సఫ్దర్‌జంగ్‌లోనే అన్ని సదుపాయాలను సమకూర్చుకుంటామ’ని చెప్పారు.
Advertisement