జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఏ. కృష్ణప్ప ఎంపికయ్యారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఏ. కృష్ణప్ప ఎంపికయ్యారు. నగరంలోని ఓ హోటల్‌లో జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలో బుధవారం పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. అనంతరం కృష్ణప్పను అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. నగరంలోని కేఆర్ పురం నియోజక వర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన కృష్ణప్ప 1999-2004 కాలంలో ఎస్‌ఎం. కృష్ణ హయాంలో సాంఘిక సంక్షేమ, పశు సంవర్ధక శాఖలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో చిర కాల అనుబంధం కలిగిన ఆయనకు గత శాసన సభ ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్‌ను నిరాకరించడంతో జేడీఎస్‌లో చేరారు. ఆయన సామాజిక వర్గమైన యాదవులు అధిక సంఖ్యలో ఉన్న చిత్రదుర్గ జిల్లా హిరియూరు నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం వరించలేదు.
మొన్నటి దాకా జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కుమారస్వామి వ్యవహరించారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే. ఈ నేపథ్యంలో బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. వాస్తవానికి ఆ రెండు స్థానాలు జేడీఎస్‌వే. కుమారస్వామితో పాటు మాజీ మంత్రి చలువరాయ స్వామి రాజీనామాలతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం కుమారస్వామి రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జేడీఎల్‌పీ నాయకుడిగా కొనసాగాలని ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పట్టుబట్టడంతో సరేనన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు ఎంసీ. నాణయ్య, బండెప్ప కాశంపూర్ ఇక్బాల్ అన్సారీ, మధు బంగారప్ప ప్రభృతులు పాల్గొన్నారు.