
‘బీసీ బిల్లు’కు లాలూ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌కు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)అధినేత లాలూ ప్రసాద్ మద్దతు తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చేస్తున్న పోరాటానికి సహకరిస్తానని లాలూప్రసాద్ హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మీడియాకు తెలిపారు. శుక్రవారం ఇక్కడ లాలూప్రసాద్‌ను కలసి బీసీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకపోవడంతోపాటు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారడంతో బీసీలు మరింత వెనుకబడిపోతున్నారని వివరించినట్లు చెప్పారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీల పక్షాన పోరాడే బాధ్యత తీసుకోవాలని లాలూను కోరినట్లు తెలిపారు. బిహార్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల చట్టసభలకు బీసీ ప్రజాప్రతినిధులు మెజారిటీ సంఖ్యలో ఎన్నికవుతున్నారని, దక్షిణాది రాష్ట్రాల్లో అది ఎందుకు సాధ్యం కావడం లేదని లాలూ ప్రశ్నించారని చెప్పారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేతలు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని, కేంద్రస్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన వివరాలు వచ్చిన తరువాత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తామని, వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని జస్టిస్ ఈశ్వరయ్య హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు.