
నేటితో తెర
ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే.
► తారాస్థాయిలో ప్రచారం
► సీఈసీతో అధికారుల సమాలోచన
► నజీంజైదీ నిర్ణయం ఏంటో?
► మరి కొన్ని గంటల్లో ప్రకటన
ఆర్కేనగర్ ఉప ఎన్నికలప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటల తో ముగియనుంది. ప్రచారం తారాస్థాయికి చేరింది. ఆదివారం
ఆగమేఘాలపై నేతల పర్యటనలు సాగాయి. ఇక,ఎన్నికల నిర్వహణపై సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ నిర్ణయాన్ని ప్రకటించ నున్నారు. దీంతో ఎన్నికలు జరిగేనా, రద్దయ్యేనా? అన్న ఉత్కంఠ రెట్టింపైంది.
సాక్షి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. సంఖ్య మరీ ఎక్కువ కావడంతో ఒక్కో పోలింగ్ బూత్‌లో నాలుగు ఈవీఎంల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఎన్నికల తేదీ (బుధవారం) సమీపించడంతో ఇందు కు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక, ఎన్నికల సామగ్రిని పోలింగ్ బూత్‌లకు తరలించాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచా రానికి సోమవారం చివరి రోజు కావడంతో నియోజకవర్గంలో ఉన్న బయటి వ్యక్తులు ఖాళీ చేసి వెళ్లి పోవాలని హుకుంను ఎన్ని కల యంత్రాంగం జారీ చేసింది. ఇక, ఆదివారం సెలవు దినం కావడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నేతల సుడిగాలి పర్యటనలు సాగాయి. ఆదివారం ప్రధాన పార్టీలన్నీ తెలుగు వారు అత్యధికంగా ఉండే కొరుక్కుపేటలోని న్యూశాస్త్రి నగర్, కామరాజనగర్, చిగురింత పాళ యం. కార్నేషన్ నగర్, అంబే ద్కర్ నగర్, అనంత నాయకీ నగర్, హరినారాయణపురం, స్టాన్లీ నగర్ ప్రాంతాల్లో నేతల పర్యటనలు ఆగమేఘాలపై సాగాయి. డీఎంకే అభ్యర్థి మరుదుకు మద్దతుగా స్టాలిన్ ఓపెన్ టాప్ జీపులో పర్యటించారు.
బీజేపీ అభ్యర్థి గంగైఅమరన్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి, తమిళిసై సౌందరరాజన్ ఓపెన్ టాప్ జీపులో పర్యటించారు. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ తెలుగువారి ప్రాంతాల్లో సభ రూపంలో ప్రచారం చేస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రాలను స్వీకరిస్తూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. తమిళనాడు తెలుంగు మక్కల్ కట్చి అభ్యర్థి లలిత తెలుగు వారిని ఆకర్షిస్తూ, తెలుగులో ప్రసంగాలు సాగిస్తూ ముందుకు సాగారు. అన్నాడీఎంకే అమ్మ పురట్చి తలైవీ అభ్యర్థి మధుసూదనన్‌కు మద్దతుగా మాజీ సీఎం పన్నీరుసెల్వం ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.
ఒంటరిగా దీప పర్యటన నియోజకవర్గంలో సాగింది. తమ అభ్యర్థికి మధివానన్‌కు మద్దతుగా డీఎండీకే అధినేత విజయకాంత్ సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. ఇక, డీఎంకే అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సైతం ప్రచారంలో దిగడం విశేషం. ప్రచారం తారాస్థాయికి చేరడంతో నియోజకవర్గంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరమైంది. నగదు బట్వాడా కట్టడి లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రాత్రి పగలు నియోజకవర్గంలోని అన్ని వీధుల్లో దూసుకెళ్తున్నాయి. ఎంపిక చేసిన 350 చోట్ల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుండడం గమనార్హం.
జైదీ నిర్ణయం ఏమిటో: ఆర్కేనగర్‌లో ఓటుకు నోటు తాండవం చేసి ఉండడం ఆధారాలు సహా బయట పడడంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ సోమవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ, ప్రత్యేక అధికారి విక్రమ్ బాద్రా ఢిల్లీలో ఆదివారం జైదీని కలిసి అన్ని వివరాలను సమర్పించారు. తమకు ఆదాయ పన్ను శాఖ సమర్పించిన నివేదికను, తమ విచారణలో వెలుగు చూసిన అంశాలను వివరించారు. జైదీ సోమవారం కేంద్ర , రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించి ఉండడంతో ఆర్కేనగర్ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడనుందో అన్న ఉత్కంఠ రెట్టింపు అవుతోంది.
మరికొన్ని గంటల్లో సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఆర్కేనగర్‌లో నోట్ల కట్టలు తాండవం చేస్తుండడం, దీని పరిగణలోకి తీసుకుని ఎన్నికల రద్దుకు అధికారులు నిర్ణయం తీసుకుంటుండడం బట్టి చూస్తే తమిళనాట ప్రజాస్వామ్యం అన్నది లేదని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఈ దృష్ట్యా, తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.