సాక్షి, ముంబై: హోలీని పురస్కరించుకొని నగర పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పండుగరోజు మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. అలాగే హోలీ నేపథ్యంలో కాముడి దహనం కోసం ఎవరైనా చెట్లను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నత పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మామూలు రోజుల కంటే కూడా ముఖ్యంగా హోలీ రోజున మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో నగర పోలీసులు ఈ పండుగను పురస్కరించుకొని గట్టి బందోబస్తును నిర్వహించేందుకు నిర్ణయించారు.
కొన్నేళ్లుగా హోలీ రోజున యువకులు దారిన పోయే మహిళలను అసభ్యకర పదజాలంలో వేధించడం సర్వసాధారణమైపోయింది. దీంతోపాటు రంగులు జల్లుకోవడం వల్ల కొందరు కంటిచూపు కోల్పోయిన సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మొఖంపై వాటర్ బెలూన్లను విసిరి వేసినప్పుడు గాయాలు కావడమేకాకుండా చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో హోలీ ఆడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా నగరవాసులకు సూచనలు ఇస్తున్నారు. ఈ ఏడాది హోలీ సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని నగర పోలీసు చీఫ్ రాకేష్ మారియా హెచ్చరించిన సంగతి తెలిసిందే. మారియా ఆదేశాల నేపథ్యంలో నగరవ్యాప్తంగా ప్రముఖ కూడళ్లలో నాకాబందీ, పెట్రోలింగ్ నిర్వహించనున్నామని ముంబై పోలీస్ అధికార ప్రతినిధి డీసీపీ మహేష్ పాటిల్ తెలిపారు.
వీధుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా సహించవద్దని సూచనలు జారీ చేశారు. పండుగ సమయంలో ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు పాటిల్ తెలిపారు. అంతేకాకుండా ఒకవేళ మహిళలు అజాగ్రత్తగా భావిస్తే వెంటనే 100 లేదా 103ని సంప్రదించాల్సిందిగా కోరారు. బీఎంసీకి చెందిన ట్రీ అథారిటీ అనుమతి లేనిదే ఎవరైనా చెట్లను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. వీరికి రూ.వెయ్యి నుంచి ఐదు వేల వరకు జరిమానా లేదా ఏడు రోజుల పాటు జైలుశిక్ష విధించనున్నట్లు పాటిల్ స్పష్టం చేశారు.
రైల్వేలో భద్రతా వారోత్సవాలు...
మార్చి 12వ తేదీ నుంచి జీఆర్పీ ప్రయాణికుల భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తోంది. హోలీ సందర్భంగా రైళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మురికివాడల్లో చాలా మంది ఆకతాయిలు నడుస్తున్న రైళ్లపై రంగు నీళ్లు నింపిన బెలూన్లను విసురుతారు.
దీంతో ప్రయాణికులకు గాయాలైన సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. దీంతో వీటిని అరికట్టడానికి రైల్వే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మురికివాడల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, హోర్డింగ్‌లను కూడా ఏర్పాటు చేయనుంది. ఇలాంటి సంఘటనలు గతంలో ఎక్కువగా హార్బర్ లైన్‌లో జరగడంతో ఇక్కడ ప్రత్యేక నిఘా వహించనున్నారు.
‘రంగు’ పడుద్ది..!
Published Thu, Mar 13 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement
Advertisement