తెలగ, బలిజ, కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 30 మేరకు కాపులను వెంటనే బీసీ జాబితాలో చేర్చి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని టీబీకే (తెలగ, బలిజ, కాపు) జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము డిమాండ్ చేశారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మంది రంలో బుధవారం తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర స్థాయి 4వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ టీడీపీ గత ప్రభుత్వాల్లాగా కాపులను వాడుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యం: అంబటి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపుల బీసీ రిజర్వేషన్ జీవో ఎడారిలో ఒయాసిస్ లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పారు. కాపులకు రెండు వాగ్దానాలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, రెండవ వాగ్దానమైన బీసీ రిజర్వేషన్ కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి కాపుల బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలియ చేస్తామన్నారు.
మాజీ మంత్రి శాసన మండలిలో విపక్షనేత సీ రామచంద్రయ్య మాట్లాడుతూ కాపు కుల సంఘాలు ఎక్కువయ్యాయని అనేక మంది తమ స్వార్థం కోసం కులాన్ని వాడుకుంటున్నారని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి దాకా ఉద్యమాలు నిర్వహించిన టీబీకే-జేఏసీని వ్యవస్థాపక సంఘంగా స్థాపించి కార్యవర్గాన్ని నియమించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో జీడీఎం ఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీఎల్వీ ప్రసాదరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్.ఎల్.వి.నారాయణ, తులసీ గ్రూప్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు, వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ కల్పించకుంటే ఉద్యమిస్తాం
Published Thu, Mar 5 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement