ముంబై: ఆన్‌లైన్‌లోనే లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్స్‌కు దరఖాస్తు చేయడానికి రవాణాశాఖ ప్రారంభించిన కొత్త పథకాన్ని అనూహ్య స్పందన కనిపిస్తోంది. పథకం మొదలైన వారంలోపే ఏకంగా 25 వేల మంది ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) వెబ్‌సైట్‌ను సందర్శించారు. అంతేకాదు ఆన్‌లైన్‌లో లెర్నింగ్ లెసైన్స్ పొందేందుకు అంధేరీ ఆర్టీఓ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ల కోసం 1,700 దరఖాస్తులు వచ్చాయి. తమ వెబ్‌సైట్‌లో ప్రతినిత్యం 350 స్లాట్లు దరఖాస్తుదారుల కోసం అందుబాటులో ఉంటాయని డీప్యూటీ ప్రాంతీయ రవాణా అధికారి భరత్ కలాస్కర్ తెలిపారు. ‘సోమవారం కోసం 325, మంగళవారం కోసం 350.. ఇలా మొత్తం 1,700 అప్పాయింటుమెంట్లు ఇచ్చాం. నిజంగా ఇది ఊహించని స్పందన. కొత్త విధానం గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు’ అని కలాస్కర్ వివరించారు. లెర్నర్ లెసైన్సు పొందడానికి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, అపాయింటుమెంట్లు తీసుకొనే కొత్త విధానాన్ని ఆర్టీఓ అధికారులు గత వారమే ప్రారంభించారు. ఇందులో పూర్తి పారదర్శకత ఉంటుందని, సులువుగా వినియోగించుకోవచ్చని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ వీఎన్ మోరే అన్నారు. వడాలా, తాడ్‌దేవ్, ఠాణే, వసై, వాషీ, కళ్యాణ్, పన్వేల్ ఆర్టీఓల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
దరఖాస్తుదారులు ఎక్కడ ఉన్నా లెర్నర్ లెసైన్సుకు దరఖాస్తు చేసుకోగలగడం ఈ విధానం ప్రత్యేకత. ఫలితంగా దళారుల ప్రమేయానికి అవకాశం ఉండదు. దరఖాస్తు ఫారాలు నింపడానికి కూడా దళారులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నందున, వారి ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తున్నామని ఆర్టీఓల అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి ఏ ఒక్కరిపైనా వివక్ష చూపించకుండా దరఖాస్తుదారులందరికీ డ్రైవింగ్ పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తామని మోరే అన్నారు. ఏజెంట్ల ద్వారా వచ్చేవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. వీటికితోడు అంధేరీ ఆర్టీఓ లెర్నర్ లెసైన్సును కేవలం పదే నిమిషాల్లో జారీ చేస్తోంది. అంతేకాదు డ్రైవింగ్‌టెస్టు నిర్వహణ కోసం అత్యాధునిక ట్రాక్‌ను నిర్మిస్తోంది. దీని చుట్టూ సీసీటీవీ కెమెరాలను బిగిస్తారు. ఆటోమేటెడ్ విధానంలో పరీక్షలు నిర్వహించడం వల్ల కంప్యూటరే దరఖాస్తుదారుడి డ్రైవింగ్ నైపుణ్యాలను పరీక్షించి నివేదిక ఇస్తుందని మోరే వివరించారు.
డ్రైవర్లకు ఆరోగ్యశిబిరాలు
వాషి: ప్రజారవాణా వాహనాల డ్రైవర్ల కోసం వాషి ఆర్టీఓ జనవరి 3-17 తేదీల్లో ‘పెహ్లే ఆప్’ పేరుతో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈసారి ఆరోగ్య సంరక్షణపై డ్రైవర్లకు అవగాహన కలగించడంపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపోటు, కంటిచూపు, శారీరక దృఢత్వం వంటి పరీక్షలు చేస్తారు. డ్రైవర్‌కు ఆరోగ్యవంతమైన శరీరం, కంటిచూపు అత్యవసరం కాబట్టి ఈ రెండింటిపై తాము దృష్టి సారిస్తామని వాషి డిప్యూటీ ఆర్టీఓ సంజయ్ ధయ్‌గుడె అన్నారు. వ్యసన రహిత జీవితం ప్రాధాన్యం, ఎయిడ్స్‌పై అవగాహన వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. భద్రత వారోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అధికారుల బృందాలు కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాయని వెల్లడించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ మాట్లాడినా, కార్లకు టింటెడ్ ఫిల్మ్‌లు అంటించినా భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు.
లెర్నర్ లెసైన్స్ మరింత సులువు
Published Tue, Dec 31 2013 11:33 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement