ఇస్ బార్ చలేగీ ఝాడు!!
న్యూఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆటోవాలాలు లోక్‌సభ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగారు. ఈసారి ఆప్ తరఫున ప్రచారం చేయొద్దంటూ కొన్ని ఆటో సంఘాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ సమస్యలను పరిష్కరించకుండానే గద్దె దిగిపోవడంతో నిరాశచెందిన ఆటోవాలాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా మళ్లీ ఆటోలపై ఆప్ ప్రచార పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ‘ఇస్ బార్ చలేగీ ఝాడు’ అంటు రాసి ఉన్న పోస్టర్లు, వాటిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నమైన చీపురు గుర్తుతో ఆటోవాలాలు ప్రచారం చేస్తున్నారు.
పార్టీ కూడా దాదాపుగా ఇదే రకమైన ‘ఫిర్ చలేగీ ఝాడు’ నినాదంతో ఆప్ ప్రచార పర్వాన్ని రక్తికట్టిస్తోంది. ఆటోవాలాల మద్దతు కూడా తోడవడంతో ఆ పార్టీ ప్రచారం తారాస్థాయికి చేరింది. ఈ విషయమై ఆప్ ఆటో సెల్ కోఆర్డినేటర్ సంజయ్ చావ్లా మాట్లాడుతూ... ‘ఆటోలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంప్రదాయ ప్రచార రథాలు. తమను వేధిస్తున్నారంటూ రోజుకు కనీసం 30 నుంచి 40 మంది ఆటోవాలాలు ఫోన్ చేస్తున్నారు. ఆటోల వెనుక ఉన్న పోస్టర్లను చింపివేస్తున్నారంటూ, ఎన్నికల సంఘం ఆంక్షలను సాకుగా చూపుతున్నారంటూ చెబుతున్నారు. ఆటోల వెనుక పోస్టర్ల విషయమై ఎన్నికల సంఘానికి ఎవరూ ఫిర్యాదు చేయకుండా పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారు? ఎవరైనా ఆటోవాలా ఈ విషయమై పోలీసులను ప్రశ్నిస్తే బలవంతంగా చలాన్లు రాస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల తీరు సరికాద’న్నారు.
పార్టీ తరఫున ఆటోవాలాల ప్రచారం ఈ నెల 19న ప్రారంభమైంది. కేజ్రీవాల్ చిత్రపటాలతో ఉన్న పోస్టర్లను ఆటోల వెనుక అతికించి ప్రచారం చేస్తున్నారు. కాగా సోమవారం నుంచి ఆటోల వెనుక కొత్త పోస్టర్లు దర్శనమిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో కేవలం కేజ్రీవాల్ ముఖచిత్రం ఉన్న పోస్టర్లు మాత్రమే వినియోగించామని, ఈసారి మాత్రం రకరకాాల నినాదాలు రాసి ఉన్న పోస్టర్లను ఉపయోగించనున్నట్లు చెప్పారు. ‘అంబానీకి సర్కార్ యా ఆమ్ ఆద్మీకి సర్కార?’ (అంబానీ ప్రభుత్వం కావాలా? లేక సామాన్యుడి ప్రభుత్వం కావాలా?) అంటూ రకరకాల నినాదాలతో పోస్టర్లను ఆటోల వెనుక అతికించనున్నట్లు చెప్పారు.