తలపండిన నేతలతో తలపడడం కష్టమే
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో ఏడు లోక్‌సభ స్థానాల్లో రెండింటినుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు పాత్రికేయులే. కపిల్ సిబల్‌కు వ్యతిరేకంగా చాందినీచౌక్‌లో ఆశుతోష్‌ను, మహాబల్ మిశ్రాకు వ్యతిరేకం గా పశ్చిమఢిల్లీ నుంచి జర్నైల్‌సింగ్‌ను అభ్యర్థులుగా నిలబెట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పాత్రికేయ వృత్తిలో 23 ఏళ్ల అనుభవంగల ఆశుతోష్... హిం దీ వార్తా చానల్ ఐబీఎన్-7లో మేనేజింగ్ డెరైక్టర్‌గా నగరవాసులకు సుపరిచితు డే. ఇక హిందీ వార్తాపత్రిక దైనిక్ జాగ రణ్‌లో 15 ఏళ్ల అనుభవం కలిగిన జర్నైల్‌సింగ్ ఓ పర్యాయం విలేకరుల సమావేశంలో అప్పటి హోం శాఖ మంత్రి చిదంబరంపై బూటు విసిరిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. 1984 నాటి సిక్కు అల్లర్ల కేసులకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బూటు విసిరారు. ఢిల్లీలో వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ దిగ్గజాలుగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలకు గట్టి పోటీ ఇవ్వడమనేది స్థానిక ఓటర్లతో బొత్తిగా సంబంధాల్లేని ఈ ఇరువురు మాజీ పాత్రికేయులకు నల్లేరుపై నడకేం కాదని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఎవరిని బరిలోకి దించుతుందనే దానిపై కూడా వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాలను ఓసారి పరిశీలిద్దాం.
ముస్లిం ఓటర్లు గెలుపోటములను నిర్దేశించే చాందినీచౌక్ నియోజకవర్గంలో నిజానికి ముస్లిం ఓటర్లకన్నా వైశ్య ఓటర్ల సంఖ్య ఎక్కువ. మటియామహల్, చాందినీచౌక్, సదర్‌బజార్‌లను ముస్లిం ప్రాబల్యంగల ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోకూడా మిగతా లోక్‌సభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ నియోజక వర్గం పరిధిలోని మొత్తం పదిసీట్లలో ఆప్ నాలుగు, బీజేపీ మూడు, కాంగ్రెస్ రెండు సీట్లను దక్కించుకున్నాయి.
కపిల్ సిబల్‌పై విజయం సాధించడం అంత సులువైన విషయం కాదనే విషయాన్ని ఆశుతోష్ కూడా అంగీకరించారు. పాత ఢిల్లీపై గట్టి పట్టు ఉండడం, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం కపిల్ సిబల్ ప్రజాదరణకు కారణం. అయితే కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు గట్టిగా వీస్తుండడంతోపాటు అన్నాహజారే ఆందోళనను తీవ్రంగా వ్యతిరేకించిన నేతగా ముద్రపడడం ఆయనకు ప్రతికూలంగా మారనుంది.
ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ముస్లింలు ఆప్‌వైపు మొగ్గితే మాత్రం ఆశుతోష్ గెలుపొందడం ఖాయం.
ఇక పశ్చిమఢిల్లీ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలోని పది అసెంబ్లీ స్థానాలలో ఒక్కదానిని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. ఇది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్ల గల వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. అయితే ఇక్కడ అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అకాలీదళ్‌తో కలసి ఈ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఆప్‌కు నాలుగు సీట్లు దక్కాయి. సిక్కు ఓటర్లలో గల ప్రజాదరణ దృష్ట్యా జర్నైల్ సింగ్‌కు టికెట్ ఇచ్చినట్లు ఆప్ నేత ఒకరు చెప్పారు. పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గంలో సిక్కు ఓటర్లతోపాటు జాట్, పంజాబీ, పూర్వాంచల్ ఓటర్ల సంఖ్య ఎక్కువ. మహాబల్ మిశ్రా పూర్వాంచల్ ఓటర్ల అండతో గత ఎన్నికల్లో గెలిచారు. రాజోరీ గార్డెన్, హరినగర్‌లో సిక్కు ఓటర్లు, నజఫ్‌గడ్, మటియాలాలలో జాట్ ఓటర్లు ఎక్కువ.