ముక్కోణపు పోటీయే
సాక్షి, న్యూఢిల్లీ:తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రంలో ఇది వరకు కాంగ్రెస్, బీజేపీలకు పరిమితమైన పోరు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రవేశంతో ముక్కోణపు పోటీగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయప్రస్థానాన్ని ఆప్ ఈ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. గత ఎన్నికల్లో మాదిరిగా కాంగ్రెస్ ఈసారి ఏడింటికి ఏడు స్థానాలు గెలవడం అసాధ్యంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో షీలా దీక్షిత్‌ను చిత్తుగా ఓడించి ఆమెకు ఢిల్లీ రాజకీయాల్లో చోటు లేకుండా చేసిన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి ఇప్పుడు దేశ రాజకీయాలపైకి మళ్లింది. అటు కేజ్రీవాల్, ఇటు షీలా దీక్షిత్ ఢిల్లీ రాజకీయాల నుంచి నిష్ర్కమించడంతో బీజేపీ నేత హర్షవర్ధన్‌కు అత్యున్నత నేత హోదా దక్కింది. నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలంటే ఢిల్లీలో గట్టి నేతకు పార్టీ పగ్గాలను అప్పగించాలన్న ఉద్దేశంతో బీజేపీ ఆయనను ఢిల్లీశాఖకు అధ్యక్షునిగా చేసింది. అంతేకాదు ఆయనను కూడా ఎన్నికల బరిలోకి దింపి ప్రత్యర్థి పార్టీలకు షాకిచ్చింది. విశ్వసనీయనేతగా, నిజాయితీపరునిగా హర్షవర్ధన్‌కున్న పేరును మరింత పెంచడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆప్.. బలాలు, బలహీనతలు
ఈసారి ప్రధానపోటీ ఆప్, బీజేపీ మధ్య ఉంటుందని అంటున్నప్పటికీ, రెండు పార్టీల్లో ఏ ఒక్క దానికీ ఏడింటికి ఏడు స్థానాలు దక్కే సూచనలు కనిపించడం లేదు. స్థానికులను కాదని బయటి వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టడం రెండు పార్టీల కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఆప్ 49 రోజుల పాలనలో కరెంటు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి సరఫరా వంటి అనేక ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంది. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లుపై హఠాత్తుగా రాజీనామా చేసిన తీరుపై కొంత అసంతృప్తి ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే పేదలకు ఆప్‌పై పేదలకు ఆసక్తి పెద్దగా తగ్గనప్పటికీ మధ్యతరగతి ఓటర్లకు మోజు తగ్గింది. దీనిని గుర్తించిన ఆప్ ఢిల్లీ విభాగం ఇంటింటికీ ప్రచారంతో ప్రజల సందేహాలు తీరుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మిగతా రెండు పార్టీల కన్నా ముందే లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఢిల్లీకి బయటివారిని అభ్యర్థులుగా ప్రకటించడం సొంత కార్యకర్తలకే రుచించ లేదు. చాందినీచౌక్‌లో ఆశుతోష్, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఆనంద్‌కుమార్, న్యూఢిల్లీలో ఆశిష్ ఖేతాన్‌కు టికెట్ ఇవ్వడంపై కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి మెల్లగా తగ్గుతోందని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉండగా నార్త్ వెస్ట్ ఢిల్లీ అభ్యర్థిగా ప్రకటించిన మహేంద్ర సింగ్ తన టికెట్‌ను హఠాత్తుగా వాపసు చేయడం తాజా పరిణామం. ఇప్పుడు ఈ సీటు నుంచి మాజీ మంత్రి రాఖీ బిర్లా పోటీ చేస్తారని అంటున్నారు. ఆప్‌లో దేవేంద్ర సెహ్రావత్ మినహా మిగతా వాళ్లంతా రాజకీయాలకు కొత్తే! ఆశుతోష్, ఆశిష్ ఖేతాన్, జైర్నైల్‌సింగ్ మీడియా రంగానికి చెందినవాళ్లు. రాజ్‌మోహన్ గాంధీ మహాత్మా గాంధీ మనవడు. ఆనంద్ కుమార్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ఆశుతోష్ ఐబీఎన్ 7 చానెల్ ద్వారా ప్రజలకు సుపరిచితుడు. ఆశుతోష్ నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. కేంద్రమంత్రి చిదంబరంపై బూటు విసిరి సింగ్ వార్తల్లోకి ఎక్కారు. రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజాస్వన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
బీజేపీలో ఉత్సాహం..
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుకూల పవనాలు వీయడం బీజేపీలో ఉత్సాహాన్ని నింపుతోంది. నమో టీ పార్టీ, నమో చౌపాల్, ఏక్ నోట్ కమల్ పర్ ఓట్, మోడీ ఫర్ పీఎం, ఓట్ ఫర్ మోడీ వంటి కార్యక్రమాలతోపాటు చిన్న చిన్న సమావేశాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను తన ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించక చేసిన పొరపాటును కూడా బీజేపీ సరిదిద్దుకుంది. ఆప్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని తన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచారాన్ని కూడా ఆప్‌పైనే ఎక్కుపెటింది. మైనారిటీ ఓటర్లలో పారీపై ఉన్న సందేహాలు, అంతర్గత విభేదాలు బీజేపీకి ప్రధాన అవరోధం. బయటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా పార్టీలో చేరిన ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.