శ్రీ జగన్నాథ ఆలయ
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని ఆభరణాలు, ఇతరేతర అమూల్యమైన సంపద భద్రంగా ఉన్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం(ఎస్‌జేటీఏ) తెలిపింది. శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు కావడంతో స్వామి అమూల్య రత్న సంపద పట్ల పలు అపోహలు ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ నిరాధారంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. రత్న భాండాగారం రెండు అంచెల్లో ఉంటుంది. బాహ్య భాండాగారం(బహారొ భొండారొ), లోపలి భాండాగారం (భిత్తొరొ భొండారొ)గా పేర్కొన్నారు. స్వామి అమూల్య రత్న సంపద లోపలి భాండాగారంలో భద్రంగా ఉంటుంది. నిత్య వినియోగ ఆభరణాలు, పాత్రలు వగైరా సొత్తు బాహ్య భాండాగారంలో ఉంటుంది.
అరుదుగా వినియోగించే ఆభరణాలు లోపలి భాండాగారంలో భద్రపరుస్తారు. బాహ్య భాండాగారం తెరిస్తే గానీ లోపలి భాండాగారం లోనికి ప్రవేశించడం అసాధ్యం. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం స్థితిగతుల్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇటీవల బాహ్య భాండాగారం తెరిచారు. గోడలు అక్కడక్కడ స్వల్పంగా బీటలు వారినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాహ్య భాండాగారం గ్రిల్ నుంచి లోపలి భాండాగారం వైపు దృష్టి సారించారు. ఈ భాండాగారం తలుపుల తాళాలకు సీలు వేసినట్లు అధికార వర్గం గుర్తించింది. ఈ లెక్కన లోపలి భాండాగారం సురక్షితంగా ఉన్నందున దానిలో రత్న సంపద కూడా భద్రంగా ఉండడం తథ్యంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది.
తాళం గల్లంతు వాస్తవమే!
రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం పరిశీలించడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం తెరిచేందుకు తా ళం చెవి కోసం వెతుకులాట మొదలైంది. జిల్లా ట్రెజరీలో ఉండాల్సిన తాళం చెవి కనిపించనట్లు జిల్లా కలెక్టరు బహిరంగపరిచారు. అధికార సమూహం అంతా ఏకమై గాలించిన రత్న భాండాగారం తాళం చెవి కాన రాని మాట వాస్తవం. కాగిత పత్రాలు, దస్తావేజులు వగైరా క్షుణ్ణంగా పరిశీలించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. అంచెలంచెలుగా అధికారులు ఈ పరిస్థితిని సమీక్షించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నిర్ణయించారు. 1985 సంవత్సరంలో లోపలి భాండాగారం తెరిచి ఆభరణాలు వగైరా లెక్కించినట్టు దస్తావేజులు స్పష్టం చేస్తున్నాయి.
లెక్కింపు ముగించి ఈ భాండాగారానికి 3 తాళాలు వేశారు. ఒక తాళానికి సీలు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల 4వ తేదీన రత్న భాండాగారం పరిశీలించారు. తాళం చెవి గల్లంతుపట్ల 17 మంది సభ్యుల నిపుణుల బృందం తలకిందులు అయి ప్రయత్నించిన గాలించ లేకపోయింది. బాహ్య భాండాగారం తెరిచి పరిశీలన మొక్కుబడిగా ముగించేశారు. లోపలి భాండాగారం పరిశీలించాల్సిన అవసరం లేనట్లు నిపుణుల బృందం ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని విశ్లేషిస్తే తాళం చెవి లేనందున లోపలి భాండాగారం పరిశీలన సాధ్యం కానట్లు తెలుస్తుంది.
అంచెలంచెలుగా సమావేశాలు
ఏప్రిల్ 4వ తేదీ ఉదయం రత్న భాండాగారం పరిశీలన ముగించిన వెంటనే శ్రీ మందిరం సబ్ కమిటీ అదే రోజు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయింది. తాళం చెవి గల్లంతు శీర్షికతో ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం తీర్మానం మేరకు మర్నాడు భువనేశ్వర్ స్పెషల్ సర్క్యుట్ హౌసులో శ్రీమందిరం పాలక మండలి సమావేశం జరిగింది. పూరీ గజపతి మహా రాజా, శ్రీ జగన్నాథుని తొలి సేవకుడు దివ్య సింఘ్ దేవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కూడా తాళం చెవి జాడ కానరానందున విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు.
ఇంటర్నల్ ఆడిట్
తాళం చెవి జాడ కోసం ఇంటర్నల్ ఆడిట్ కూడా నిర్వహించారు. శ్రీమందిరం సేవా పాలక మండలి ప్రముఖుడు ఈ ఆడిట్ నిర్వహించారు. 1985 సంవత్సరంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు పురస్కరించుకుని శ్రీమందిరం పాలక మండలి డిప్యుటీ పాలకుడు రబీంద్ర నారాయణ మిశ్రా నుంచి రత్న భాండాగారం తాళం చెవి తీసుకున్నట్టు ఆడిట్ ఖరారు చేసింది. శ్రీ మందిరం ప్రధాన పాలకునికి ఈ నివేదిక సమర్పించారు. కలెక్టరేటులో రికార్డు రూమ్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంత ప్రయాసపడిన తాళం చెవి జాడ దొరక లేదు.
న్యాయ విచారణకు సహకరిస్తాం
రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని శ్రీ జగన్నాథ ఆలయ అధికారవర్గం(ఎస్‌జేటీఏ) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment