ఫేస్ బుక్లో హెల్మెట్లపై సెటైర్లు
చెన్నై: ద్విచక్రవాహన చోదకులు విధిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలన్న నిబంధన మరో మూడురోజుల్లో అమలులోకి రానుండగా, పోలీసులకు, ప్రజలకు మధ్య నెలకొనే పరిస్థితులపై ఫేస్‌బుక్‌లో సెటైర్లు హల్‌చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు రెండేళ్ల క్రితం అమలులో ఉండిన హెల్మెట్ నిబంధన కాలక్రమేణా సన్నగిల్లింది. హెల్మెట్ లేని వాహనచోదకులకు జరిమానా విధించే పోలీసులు కూడా చూసీ చూడనట్లువదిలేస్తున్నారు. దాంతో హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపాలన్న సంగతి ప్రజలు దాదాపుగా మరిచిపోయారు. అయితే జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో హెల్మెట్ వాడకం మళ్లీ అమలులోకి రానుంది.
ద్విచక్ర వాహనాన్ని (బైక్‌లు) నడిపేవారే కాదు వెనుక కూర్చునేవారు సైతం హెల్మెట్ ధరించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ వినియోగం ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలల్లో పిల్లలను వదిలేందుకు, వారాంతపు సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుండి బీచ్‌లు, షికార్లకు వెళ్లడం ప్రజలకు పరిపాటి. పాఠశాల్లో వదిలేందుకు తీసుకెళ్లే పిల్లలకు సైతం హెల్మెట్‌ను ధరింపజేయాలా అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు.
మరో మూడురోజుల్లో హెల్మెట్ వాడకం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ధరించని పక్షంలో భారీ జరిమానా, మోటార్‌బైక్ డాక్యుమెంటు స్వాధీనం, డ్రైవింగ్ లెసైన్సు రద్దు వంటివి అమలుచేస్తారని తెలుస్తోంది. హెల్మెట్ లేనివారు జరిమానా ఎంత చెల్లించాలనే అంశాన్ని కూడా పోలీసులు వెల్లడించడం లేదు.
అయితే మార్గమధ్యంలో ఎవరినైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్న పక్షంలో రెండోవ్యక్తికి హెల్మెట్ లేకుంటే పరిస్థితి ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రెండు హెల్మెట్లు సిద్ధం చేసుకున్నా మోటార్ సైకిల్ స్టాండ్లవారు నిరాకరిస్తున్న పరిస్థితిలో వాటిని నిరంతరం కాపాడుకోవడం ఎలా సందేహం వ్యక్తం చేస్తున్నారు. విధిగా హెల్మెట్ నిబంధన ఆహ్వానించదగ్గదే, దాని అమలులో లోపాలే భయపెడుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో సెటైర్లు:
హెల్మెట్ వాడకంపై ప్రజలకు స్పష్టమైన సందేశాలు ఇవ్వకుండానే పోలీస్‌శాఖ అమలుకు సిద్ధం కావడంపై అయోమయం నెలకొంది. ఈ పరిస్థితిపై ఔత్సాహికులు ఫేస్‌బుక్‌పై సెటైర్లు సంధిస్తున్నారు. ‘ఈనెలాఖరు వరకు ప్రజల పక్షాన ఉన్న గురు మహర్దశ జూలై 1వ తేదీ నుంచి పోలీసుశాఖకు మారుతుంది.
అలాగే గురుమహర్దశతో సంతోషంగా కాలం వెళ్లబుచ్చుతున్న ప్రజానీకానికి వచ్చేనెల 1వ తేదీ నుంచి శనిమహర్దశ చుట్టుకుంటుంది. గురుని చూపు కోటి లాభం అనే నానుడిని నిజం చేస్తూ పోలీస్ శాఖకు జరిమానాల పేరిట కాసుల వర్షం ఖాయం. అలాగే శిరస్త్రాణం ధరించడం ద్వారా ప్రజలు శనిర్దశ నుంచి తప్పించుకోవచ్చని ఫేస్‌బుక్‌లో ప్రజలకు పరిహారం కూడా చూపిస్తున్నారు.