బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరి మాట వినరని, ఆయన నియంతృత్వ వైఖరి వల్ల అసమ్మతి ఉండదని, అలాంటప్పుడు చర్చకు స్థానమెక్కడిదని చవాన్ మంగళవారం మీడియాకు తెలిపారు.
ముంబై: మోడీది మోనార్క్ పాలన అని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరి మాట వినరని, ఆయన నియంతృత్వ వైఖరి వల్ల అసమ్మతి ఉండదని, అలాంటప్పుడు చర్చకు స్థానమెక్కడిదని చవాన్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మోడీ నాయకత్వం గురించి దేశ ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారని సీఎం చవాన్ తెలిపారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించే సాధారణ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు మధ్య యుద్ధం జరుగుతుందనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు.
ఒకవేళ మోడీ దారిలో వెళ్లాలనుకుంటే బీజేపీకి మేనిఫెస్టోతోనే పనిలేదని చెప్పారు. పార్టీ నేనే, మేనిఫెస్టో నేనే, చర్చలు, ఆలోచనలకు తావు లేదన్నది మోడీ సిద్ధాంతమని ఆయన విమర్శించారు. బీజేపీలోనే ఒక వర్గం అభివృద్ధి విషయాలతో పాటు ఉమ్మడి పౌరస్మృతి, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దులపై దృష్టి పెడితే, మరో వర్గం తమను తాము ప్రజల్లో ఎలా గుర్తింపు పొందాలన్న దానిపై దృష్టి కేంద్రీకరించారన్నారు. బీజేపీ ప్రాచుర్యం కోసం టీవీ, సామాజిక అనుసంధాన వేదికలను ఉపయోగించుకుంటోందని, వారి మేనిఫెస్టో, విధానాల్లో విలువలేమీ లేవని మండిపడ్డారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే యూపీఏ పథకాలను రద్దు చేస్తామా లేదా? మరింత సమర్థవంతంగా అమలు చేస్తామా? అన్న దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే వరకు వేచిచూసిన బీజేపీ దాన్నే కాపీ, పేస్ట్ చేసిందని ఆరోపించారు.
స్పందన బాగుంది...
గురువారం తొలి దశ ఎన్నికలు జరగనున్న విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ స్థానాల్లో అధికార ప్రజాస్వామ్య (డీఎఫ్) కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని సీఎం చవాన్ తెలిపారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. శివసేన పార్టీని పతనం చేసేందుకు బీజేపీ, ఎమ్మెన్నెస్ రహస్య అవగాహనకు వచ్చాయని తెలిపారు. లౌకిక ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే పాల్ఘర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర గవిత్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. రాయ్‌గఢ్ స్థానం విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆర్.అంతులేతో ఇప్పటికే మాట్లాడామని చెప్పారు.