న్యూఢిల్లీ:పనిమనిషి రాఖీ భద్ర హత్య కేసులో తనను పోలీసులు ఇరికించారని బీఎస్‌పీ ఎంపీ ధనంజయ్ సింగ్ వాపోయాడు. అనూహ యమైన, హింసాత్మమైన ధోరణిని అనుసరిస్తుండడంతో భార్య జాగృతి నుంచి తాను విడిపోయానని, వేరుగా నివసిస్తున్నానని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం సమర్పించిన బెయిల్ విన్నపంలో ఆయన పేర్కొన్నాడు. మృతురాలు రాఖీ భద్రను ఈ నెల ఒకటో తేదీనుంచే చిత్రహింసలకు గురిచేశారని, నాలుగో తేదీన ఆమె చనిపోయిందని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారన్నారు. అయితే ఆ సమయంలో తాను తన నియోజకవర్గంలో ఉన్నానని ధనంజయ్ తెలిపారు.
అంతేకాకుండా జాగృతి నుంచి విడాకులు కోరుతూ ఇప్పటికే ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. అధిక కోపం వల్ల వచ్చే ఒత్తిడితో తన భార్య జాగృతి బాధపడేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రవర్తనతోపాటు మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావడం కోసం గత ఏడాది మే నెలలో ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లానని, అయితే ఆ వైద్యుడు ఇచ్చిన మందులను జాగృతి వాడలేదని తెలిపారు. 175, సౌత్ ఎవెన్యూలోని తన అధికారిక నివాసంలో జాగృతి తన వివేచన మేరకే నివసిస్తోందని, అక్కడ పనివాళ్లకు కేవలం తాను జీతాలు మాత్రమే చెల్లించేవాడినన్నారు. ఈ నెల నాలుగో తేదీన తాను తన నియోజకవర్గం నుంచి నగరానికి వచ్చానని, పోలీసులకే తానే హత్య సమాచారం అందించానని, అంతేకాకుండా ఆ ఇంట్లో కొంతకాలంగా తాను ఉండడం లేదనే విషయాన్ని కూడా తెలియజేశానని బెయిల్ విన్నపంలో పేర్కొన్నారు.
జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ దంపతులు
పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్‌పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతిలను స్థానిక న్యాయస్థానం నాలుగురోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. గతంలో విధించిన పోలీసు కస్టడీ గడువు సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు వీరిరువురినీ శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గోమతి మనోచా ఎదుట పోలీసులు హాజరుపరిచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల రాఖీ భద్ర హత్యకు గురవడంతో ఈ నెల ఐదో తేదీన పోలీసులు వీరిరువురినీ అరెస్టుచేసిన సంగతి విదితమే.
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన కొడుకు
పనిమనిషి రాఖీభద్ర మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ఆమె కుమారుడు షెహజాన్ నిరాకరించాడు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. షెహజాన్‌ను నగరానికి తీసుకొచ్చేందుకు స్థానిక పోలీసుల బృందం పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో తిష్టవేసింది. ఇందుకోసం అక్కడి పోలీసులతోపాటు ఇరుగునపొరుగువారి సహాయం కూడా తీసుకుంటోంది. ఇదిలాఉండగా తల్లి హత్య కేసు నేపథ్యంలో తన ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లొచ్చనే భయంతో షెహజాన్ ఈ నెల ఏడో తేదీన నగరం నుంచి పారిపోయాడు. ఈ హత్యతో తాను ఎంతగానో భయపడ్డానని పోలీసులకు షెహజాన్ తెలియజేశాడు.
హత్య కేసులో ఇరికించారు
Published Mon, Nov 11 2013 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
Advertisement
Advertisement