మురుగన్‌ను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, (ఇన్‌సెట్) మురుగన్
అన్నానగర్: మహిళలకు స్కూటర్ ఇస్తున్నట్లుగానే పురుషులకు ఆటో ఇవ్వాలని మద్యం మత్తులో విద్యుత్ టవర్ ఎక్కి ఓ డ్రైవర్ ఆత్మహత్య బెదిరింపులు ఇచ్చాడు. ఈ ఘటన సోమవారం కాక్కాతోప్పులో చోటుచేసుకుంది. పరమకుడి సమీపంలోని తండివాదేవి పట్టణానికి చెందిన కాట్టురాజా కుమారుడు మురుగన్(34). ఇతను అద్దెకు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. కొన్ని వారాల కిందట అతన్ని పని నుంచి తొలగించడంతో ఖాళీగా ఉన్నాడు. కుటుంబసభ్యులతో తగాదా పడేవాడు. ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో కాక్కాతోప్పు ప్రాంతంలోని 60 అడుగుల ఎత్తైన హై ఓల్టేజి విద్యుత్ టవర్ ఎక్కాడు. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించారు.
వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారంతో పోలీసు జాయింట్ సూపరింటెండెంట్ సతీష్‌కుమార్, నగర సీఐ పొన్‌రాజ్ సిబ్బందితో అక్కడికి వచ్చారు. ఇంకా 108 ఆంబులెన్స్ వాహనం పిలిపించారు. మురుగన్‌ను పోలీసులు కిందికి దిగమని అడిగారు. అందుకు అతను మహిళలకు స్కూటర్ ఇస్తున్నట్లు పురుషులకు ఆటో ఇవ్వాలన్నాడు. వెంటనే కొత్త ఆటోను అక్కడికి తెప్పించారు. అయినా మురుగన్ దానికి నంబర్ లేదని కొత్త ఆటో కొనివ్వాలని లేకపోతే కిందకుదూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అగ్నిమాపక సిబ్బంది ముగ్గురు టవర్ పైకి ఎక్కుతుండగా గమనించిన అతను వారిని దిగమని కేకలు వేశాడు. లేదంటే నేను దూకేస్తానన్నాడు. దీంతో వారు ఆగిపోయారు. తరువాత కుంటుంబీకులు వచ్చి మాట్లాడారు. నీకు ఆటో కొనిస్తామని కిందకు దిగి రా అని పలికారు. అప్పటికే టవర్ పైకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మురుగన్‌ను పట్టుకున్నారు. అతని నడుముకి తాడుతో కట్టి సాయంత్రం 4 గంటలకు కిందకు తీసుకువచ్చారు. అతన్ని 108 ఆంబులెన్స్ ద్వారా పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment