బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా గర్భవతిని చేసిన నేరస్థుడికి ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
న్యూఢిల్లీ: బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా గర్భవతిని చేసిన నేరస్థుడికి ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నిందితుడికి ఇంతకు ముందే వివాహమైంది. భార్య పిల్లలు ఉన్నారు. కాబట్టి, బాలికను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం, గర్భవతిని చేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. అదనపు సెషన్స్ జడ్జి రజనీష్ కుమార్ గుప్తా ఈ మేరకు నేరస్థుడికి జైలు శిక్షను ఖరారు చేశారు. బీహార్‌కు చెందిన వ్యక్తికి జైలు శిక్షతోపాటు రూ. 7,000 జరిమానాను కూడా విధించారు. పోలీసులు తెలిపిన కేసు వివరాలిలా ఉన్నాయి.. డిసెంబర్ 23, 2011లో తన కూతురు కన్పించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డిసెంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కన్పించలేదని పేర్కొన్నాడు. కిడ్నాప్ చేసినట్లు ఓ వ్యక్తిపై అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బాలిక ఫిబ్రవరి 3, 2012లో బీహార్‌లోని సామస్తీపూర్‌లో పోలీసులు కనుగొన్నారు. వైద్యపరీక్షల అనంతరం ఆ బాలిక గర్భవతి అని తేలింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడి మరో 10 రోజుల్లో పోలీసులు అరెస్టు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదికను కోర్టు పరిశీలించింది. బాలిక గర్భంలోని పాపకు తండ్రి నిందితుడేనని డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తేల్చింది. ఏది ఏమైనా బాలికను బలవంతంగా లొంగదీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కోర్టు భావించింది. కాగా, ఆమె వయస్సు 18 ఏళ్లు అని, తనను ప్రేమిస్తోందని నిందితుడి తరఫున వాదనలతో కోర్టు ఏకీభ వించలేదు. ఈ మేరకు నేరస్థుడికి జైలు శిక్ష ఖరారు చేసింది.