వర్గీకరణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
♦ రిలే నిరాహార దీక్ష ముగింపులో మంద కృష్ణ మాదిగ
♦ నమ్మకద్రోహులు రాజ్యమేలుతున్నారని ధ్వజం
♦ వర్గీకరణపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
♦ స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమం అనేక త్యాగాల సమ్మేళనమని, మలి దశలో జరుగుతున్న ఈ ఉద్యమంలో వర్గీకరణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్ మంతర్‌వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష చివరి రోజు శుక్రవారం ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణే మాదిగ జాతికి సర్వస్వం అని, విద్య, ఉద్యోగ రంగాలతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ ఉన్నతి కే వలం ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల త్యాగాల మీద నిలబడ్డాయని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమని అంబేడ్కర్ చెప్పిన మాటను గౌరవించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో మాదిగలు ముందున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ భావించిందని, కానీ దొరలకు మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టేందుకు భయపడుతున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిందని, వర్గీకరణ అంశం లేకుండా చంద్రబాబు ప్రసంగం ఉండేది కాదని పేర్కొన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే మోసపూరితంగా వ్యవహరించడం నీచాతినీచమని విమర్శించారు. నమ్మక ద్రోహులు రాజ్యమేలడం బాధాకరమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ విషయంలో బీజేపీ ఆలస్యం చేయరాదని కోరారు. కాగా దీక్షకు సంఘీభావం తెలిపిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీని శంకించవద్దని అన్నారు. తమ పార్టీ వర్గీకరణకు పూర్తి మద్దతుగా నిలిచిందని తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ వర్గీకరణ చేసిందని, వర్గీకరణ బిల్లు ఎప్పుడు పెట్టినా మద్దతు తెలిపేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైన ఉద్యమమని అన్నారు. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ డిమాండ్‌పై లేఖలు రాశామని గుర్తుచేశారు. చివరి రోజు దీక్షలో ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగడి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, ఇతర నేతలు ప్రతాప్ కుమార్, గోవింద్ నరేశ్, మాతంగి ఓదేలు తదితరులు పాల్గొన్నారు.