బీసీల్లో వర్గీకరణ ఐక్యతను పెంచింది
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: గత 30 ఏళ్లుగా వెనకబడిన తరగతుల్లో వర్గీకరణ అమలవుతున్నా బీసీల్లో ఎక్కడా ఐక్యత లోపించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ బీసీల మధ్య ఐక్యతకు దారి తీసింది తప్ప ఘర్షణకు కారణం కాలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీల్లో వర్గీకరణకు కొంతమంది స్వార్థపరులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ కోసం ఢిల్లీలో చేపట్టిన ఎమ్మార్పీఎస్ ఆందోళన ఆదివారం 20వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వర్గీకరణ వాదులు కలసి ఉద్యమించాలని ఆందోళనకు మద్దతు పలికిన హరియాణా వర్గీకరణ ఉద్యమ సారథి సోదేష్ కబీర్ పిలుపునిచ్చారు.
వర్గీకరణ ఉద్యమానికి బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌గౌడ్ చెప్పారు. ఎస్సీల వర్గీకరణ కోరుతూ మాలల సంఘీభావ కమిటీ జంతర్‌మంతర్ వద్ద ఆదివారం దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు మాల మాట్లాడుతూ.. వర్గీకరణకు అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్, తెలంగాణ మాదిగ జేఏసీ, మాదిగ దండోరా ఆధ్యర్యంలో జంతర్‌మంతర్‌వద్ద సోమవారం నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నారు.