ఉమ్మడి రిజర్వేషన్ విధానానికి కాలం చెల్లింది | The joint reservation system is out of date | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రిజర్వేషన్ విధానానికి కాలం చెల్లింది

Published Wed, May 11 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

ఉమ్మడి రిజర్వేషన్ విధానానికి కాలం చెల్లింది

ఉమ్మడి రిజర్వేషన్ విధానానికి కాలం చెల్లింది

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఉమ్మడి రిజర్వేషన్ల విధానానికి కాలం చెల్లిందని, అందుకే దళితుల మధ్య అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇక్కడి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 66 ఏళ్లుగా దేశంలో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలవుతోందని, దాని వల్ల దళితుల మధ్య ఐక్యత లోపించి అంతరాలు పెరిగాయని చెప్పారు.

ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలు మాత్రమే రిజర్వేషన్లను అనుభవిస్తూ వెనకబడిన కులాలను, ఉపకులాలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనక్కి నెట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంతరం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోందన్నారు. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలకే మేలు జరుగుతోందని, మిగిలిన కులాలు వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయని 1965లో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన లోకుర్ కమిషన్ పేర్కొందని చెప్పారు. 1996లో ఏపీలో నియమించిన రామచంద్రరావ్ కమిషన్, 2001లో యూపీ ప్రభుత్వం నియమించిన హుకుంసింగ్ కమిషన్, 2007లో కేంద్రం నియమించిన ఉషా మెహ్రా కమిషన్‌లు ఇచ్చిన నివేదికలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల జరిగిన, జరుగుతున్న నష్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. అసమానతలు తొలగి, ఘర్షణ వాతావరణం పోవాలంటే నూతన రిజర్వేషన్ విధానం రావాల్సిందేనని, దళితుల్లోని ప్రతి కులానికీ రిజర్వేషన్ ఫలాలు అందేలా వర్గీకరణ ఉండాలని డిమాండ్ చేశారు.
 
కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదు: కృష్ణయ్య
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన హాజరై మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రులు ఏమాత్రం సమయం దొరికినా కాంట్రాక్టర్లను కలుస్తున్నారని, కానీ ఉద్యమకారులకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ముందుగా జంతర్ మంతర్ వచ్చేవారన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైనదని, బీసీల్లో ఉన్నట్టుగా ఎస్సీల్లో ఏబీసీడీ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీక్షలో మందకృష్ణ మాదిగతో పాటు మహిళా సంఘం నేతలు జెరిపోతుల లత, చవటపల్లి విజయ, సత్తెక్క, వినోద, శ్రీరాంరాజమ్మ, నక్షత్ర, గంగమ్మ, రేణుకాదేవి, మాదురి, శోభ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement