
విడాకులిచ్చింది.. మళ్లీ కిడ్నాప్ చేసి పెళ్లి ...
ఈ భర్త నాకు వద్దంటూ విడాకులు తీసుకున్న ఓ భార్య మళ్లీ అదే వ్యక్తిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది.
సీబీసీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశం
కేకే.నగర్: ఈ భర్త నాకు వద్దంటూ విడాకులు తీసుకున్న ఓ భార్య ఆస్తి కోసం అదే వ్యక్తిని కిడ్నాప్ చేసి మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ కేసుపై సీబీసీఐడీ విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త రాజన్ కుమారుడు మనోజ్. ఇతడు మానసిక దివ్యాంగుడు. అయితే 2008లో మనోజ్‌కు, ప్రియదర్శిని అనే యువతితో మైలాపూర్ ఆలయంలో వివాహం జరిగింది.
పెళ్లైన ఏడాది లోపే విడాకులు కోరుతూ ప్రియదర్శిని పిటిషన్ దాఖలు చేసింది. మానసిక దివ్యాంగుడనే విషయాన్ని దాచి మనోజ్ తో తనకు పెళ్లి చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ పరిస్థితిలో కోట్ల రూపాయల ఆస్తులతోపాటు కుమారుడిని సంరక్షించే బాధ్యతను తన మిత్రుడు ఆనందన్‌కు అప్పగించి మనోజ్ తండ్రి రాజన్ 2013లో మృతి చెందాడు. అనంతరం మనోజ్‌ను కూడలూరు మానసిక దివ్యాంగుల కేంద్రంలో చేర్పించారు.
గత నెల కూడలూరుకు చెందిన న్యాయవాదితో పాటు వెళ్లిన ప్రియదర్శిని... మనోజ్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి తనతో తీసుకెళ్లినట్లు దివ్యాంగుల కేంద్రం నిర్వాహకుల ద్వారా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలని ఆనందన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పిఎన్.ప్రకాష్ ... మనోజ్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని కనిపెట్టి సంరక్షణా కేంద్రంలో అప్పగించాలని పోలీసులను ఆదేశించారు. అయితే మనోజ్‌ను కిడ్నాప్ చేసి ప్రియదర్శిని మళ్లీ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ కేసు న్యాయస్థానానికి చేరింది.
దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రియదర్శిని మనోజ్‌ను మళ్లీ వివాహం చేసుకోవాలనుకుంటే అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించారు. అలా చేయకుండా న్యాయవాదితో కలిసి మనోజ్‌ను కిడ్నాప్ చేసి అతనికి సొంతమైన 1.67 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రియదర్శని సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తులు ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.